రామమందిరం విరాళాల లెక్కింపులో అక్రమాలపై ఆర్ఎస్ఎస్ విచారం 

రామమందిరం విరాళాల లెక్కింపులో అక్రమాలపై ఆర్ఎస్ఎస్ విచారం 
 
శ్రీరామ జన్మభూమి మందిరంలోని విరాళాల పెట్టె కానుకలను లెక్కించడంలో జరిగిన అక్రమాల ఘటన పట్ల  కర్ణాటకలోని బెళగావిలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక ‘అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్’ సమావేశంలో పాల్గొన్నవారందరూ విచారం వ్యక్తం చేశారు. ఆదివారంతో ముగిసిన మూడు రోజుల సమావేశాలలో ‘తీర్థ క్షేత్ర న్యాస్’ అభ్యర్థన మేరకు ప్రారంభమైన సిట్, పోలీసుల దర్యాప్తు ప్రక్రియ ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంటుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. 
 
రామ మందిరం పట్ల రామ భక్తులందరికీ ఉన్న గౌరవభావానికి, గాఢమైన విశ్వాసానికి భంగం కలిగించేలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని ‘తీర్థ క్షేత్ర న్యాస్’ నుండి ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో  సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ జీ హోసబలేల మార్గదర్శనంలో 226 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో, మార్చి 2026 తర్వాత సంఘ్ వివిధ స్థాయిలలో నిర్వహించిన శిక్షణా శిబిరాలపై సమీక్ష జరిగింది.  ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 83 ‘సంఘ్ శిక్షా వర్గ్’, 12 ‘కార్యకర్త వికాస్ వర్గ్’ శిబిరాలు పూర్తయ్యాయి. వీటిలో మొత్తం 18,842 మంది స్వయంసేవకులు శిక్షణ పొందారు. ఈ శిక్షణలో దైనందిన శాఖ, సంఘ్ కార్యపద్ధతి, గ్రామ వికాస్, కుటుంబ ప్రబోధన్, విపత్తు నిర్వహణ, పర్యావరణం వంటి అంశాలు ఉన్నాయి. 
 
శాఖ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అమలు, సెప్టెంబర్ నెలలో చేపట్టాల్సిన గరిష్ట శాఖ విస్తరణ ప్రణాళిక (శాఖ విస్తార్ యోజన)పై సమగ్ర చర్చలు జరిగాయి. దీనితో పాటు, సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్తయిన కార్యక్రమాల సమీక్ష, మిగిలిన కార్యక్రమాల ప్రణాళికపై కూడా చర్చించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవా,ల కార్యక్రమాల ద్వారా పరిచయమైన ప్రజలను సామాజిక సేవా కార్యక్రమాలు ‘పంచ పరివర్తన’ (ఐదు రకాల సామాజిక మార్పుల) కార్యక్రమాలలో క్రియాశీలకంగా భాగస్వాములను చేసే ప్రణాళికలపై చర్చ జరిగింది. 
 
2026-27 సంవత్సరానికి సంబంధించి సర్ సంఘచాలక్ జీ పర్యటన ప్రణాళిక (ప్రవాస్ యోజన)పై కూడా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన వివిధ అంశాలపై, ముఖ్యంగా జనాభా గణన, జనాభా అసమతుల్యత వల్ల తలెత్తే సవాళ్ల గురించి ఈ సమావేశంలో చర్చించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, వ్యసన విముక్తి కోసం ప్రాధాన్యతతో కూడిన కృషి అవసరంపై , సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల నిర్వహణ ప్రణాళికలపై కూడా చర్చ జరిగింది.