దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ‘దక్షిణ భారత కోకిల’ ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది.
భారతీయ చిత్రసీమ, ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ ఒక కన్నతల్లిని కోల్పోయినంతగా శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి 50 వేలకు పైగా పాటలతో గాన కోకిలగా విరాజిల్లిన జానకి ఇక లేరనే వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది.
దక్షిణాదిలో నేపథ్య గాయనిగా ప్రఖ్యాతి వహించిన ఎస్.జానకి 1938 ఏప్రిల్ 23న జన్మించారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పల్లపట్ల ఆమె స్వస్థలం. నేపథ్య గాయనిగా తమిళంలో మొదటి పాటపాడారు. అనంతరం 1957లో విడుదలైన ఎమ్మెల్యే చిత్రంలో `నీ ఆశ ఆడియాస’ పాటతో ఆమె తెలుగు అభిమానులకు పరిచయమయ్యారు.
తొలితరం గాయకుడు ఘంటసాల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనూ ఎన్నో అద్భుతమైన గీతాలు ఆలపించారు జానకి. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారామె. పది నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, ఒడిశా నుంచి ఒకటి, 1986లో కలైమామణి అవార్డు స్వీకరించారు. ఇక 2013లో జానకిని భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. 33 ఫిల్మ్ అవార్డులు కూడా లభించాయి.

More Stories
కేంద్రం అనుమతి నిరాకరణతో రేవంత్ అమెరికా పర్యటన రద్దు
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం