చైనా మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన ఇరాన్!

చైనా మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన ఇరాన్!
పశ్చిమాసియా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషించాలన్న బీజింగ్ ప్రయత్నాన్ని, అలాగే హోర్ముజ్ జలసంధి గుండా చైనా సరుకు రవాణా నౌకలకు సురక్షిత మార్గం కల్పించాలన్న అభ్యర్థనను ఇరాన్ తిరస్కరించిందని ‘ది ఎపోక్ టైమ్స్’తో మాట్లాడిన చైనా దౌత్య వర్గాల అంతర్గత వ్యక్తులు తెలిపారు. ప్రతీకార భయంతో మారుపేరును ఉపయోగించిన దౌత్య వర్గాల అంతర్గత వ్యక్తి సన్ మిన్ ప్రకారం అమెరికా-ఇరాన్ మధ్య సంఘర్షణలో కీలక మధ్యవర్తిగా వ్యవహరించడానికి, ఇరాన్ ప్రభుత్వంతో ఉన్న తన ప్రత్యేక సంబంధాన్ని ఉపయోగించుకోవాలని బీజింగ్ మొదట ప్రణాళిక వేసింది.
 
తద్వారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలైన “గ్లోబల్ సౌత్”పై నాయకత్వాన్ని దక్కించుకోవాలని చూసిందని చెప్పారు. అయితే, ఇరాన్ ఈ ఆలోచనను తిరస్కరించిందని సన్ తెలిపారు. ఇరాన్, చైనా, రష్యా ప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్న బాహ్య అభిప్రాయాలకు విరుద్ధంగా, ఇరాన్ విషయంలో చైనా, రష్యాలకు వాస్తవానికి పరస్పర విరుద్ధమైన ఉద్దేశాలు ఉన్నాయని సన్ పేర్కొన్నారు. 
 
సన్ ప్రకారం, బీజింగ్, మాస్కో రెండూ అమెరికాతో రాయితీలు పొందడానికి, తమ దౌత్యపరమైన ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ఇరాన్‌ను ఒక “బేరసారాల సాధనంగా” ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి), రష్యా నాయకులు ఇద్దరూ ఇరాన్‌కు సలహాలు ఇస్తున్నప్పటికీ, టెహ్రాన్ ఎలాంటి దౌత్యపరమైన ఏర్పాట్లను అంగీకరించడానికి నిరాకరిస్తోందని సన్ చెప్పారు. 
 
ఇరాన్ ప్రధాన డిమాండ్ ఇప్పుడు నిస్సందేహంగా స్పష్టమైంది. అదేంటంటే దౌత్యపరమైన మాటలు కాదు, వాస్తవమైన సైనిక సహాయం కోరడం. సన్ ప్రకారం, ఇది బీజింగ్‌ను ఒక సందిగ్ధంలో పడేసింది. ఇరాన్‌కు సైనిక సహాయం అందించడం అమెరికా, దాని మిత్రదేశాలతో పూర్తిస్థాయి ఘర్షణకు దారితీస్తుంది. అందుకు విరుద్ధంగా, అలా చేయడానికి నిరాకరిస్తే ఇరాన్ పాలనపై తనకున్న ప్రభావాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. 
 
చైనాలోని స్వతంత్ర మేధావి ప్రకారం ఇది సిసిపి “వోల్ఫ్ వారియర్ దౌత్యం”, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా దాని “కూటమి ఘర్షణ” మనస్తత్వం నుండి అనివార్యంగా ఎదురయ్యే ప్రతికూల పరిణామం. “అమెరికాను ప్రతిఘటించేందుకు, దృష్టి మరల్చే వ్యూహాత్మక ఎత్తుగడను ప్రయోగించే ప్రయత్నంలో, బీజింగ్ చాలాకాలంగా ఇరాన్ వంటి ప్రాంతీయ అశాంతి శక్తులకు రహస్యంగా మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ, పరిస్థితి తన నియంత్రణ నుండి జారిపోతుందని అది ఊహించలేకపోయింది,” అని తెలిపారు. 
 
ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే, ఇరాన్ పాలకవర్గం హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి, వాణిజ్య సరుకు రవాణా నౌకలు, చమురు ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. దిగ్బంధనం అంతర్జాతీయ చమురు ధరలను, రవాణా ఖర్చులను పెంచింది. ఇది చైనా ఎగుమతి సరఫరా గొలుసులలో తీవ్రమైన అంతరాయాన్ని కలిగించింది.  చైనా నౌకలను వెళ్ళనిస్తామని ఇరాన్ ప్రభుత్వం చెప్పినప్పటికీ, మార్చి 27న జలసంధి ద్వారా గల్ఫ్ నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించిన రెండు చైనా కంటైనర్ నౌకలు వెనుదిరగాల్సి వచ్చింది.  
 
చైనా వాణిజ్య నౌకల సముద్ర భద్రతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యంగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించాలని చైనా విదేశాంగ మంత్రికి సీసీపీ నాయకుడు షీ జిన్‌పింగ్ పదేపదే సూచించారని  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపారు. అయితే, ఇరాన్ స్పందన నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఇరాన్‌కు వచ్చే సరుకులలో ‘కొంత’ భాగానికి మాత్రమే భద్రతకు హామీ ఇవ్వగలమని టెహ్రాన్ పేర్కొంది. 
 
సైనిక సహాయం అందించడానికి బీజింగ్ నిరాకరించడంతో ఈ “ఎంపిక చేసిన భద్రత” హామీ ఇరాన్ “మృదువైన బ్లాక్‌మెయిల్” అని భావిస్తున్నారు. “గణనీయమైన సైనిక మద్దతు ఇవ్వడమా? లేక తమ వాణిజ్య ప్రయోజనాల భద్రతను కాపాడుకోవడమా? అనే కీలకమైన నిర్ణయం తీసుకునేలా బీజింగ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ దీనిని ఒక బెదిరింపుగా వాడుకుంటోంది.  త్ఫలితంగా రహస్యంగా మధ్యవర్తిత్వం వహించడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు పూర్తిగా నిష్ఫలమయ్యాయి. 
 
ఈ జలసంధిని దిగ్బంధించడం ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. రసాయనాలు, పందుల మేత, ధాన్యాల ధరలు పెరిగాయి. మరోవైపు, చైనా ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ సంఘర్షణను సాకుగా చూపి ధరలు పెంచుతున్నాయి. చైనా ఎగుమతి రంగాలు ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మధ్యప్రాచ్యానికి గృహోపకరణాలను ఎగుమతి చేసే షెన్‌జెన్ ఆధారిత ఓ ప్రైవేట్ సంస్థ అధిపతి “ప్రస్తుతం మా ఐదు కంటైనర్లు పోర్టులో నిలిచిపోయాయి, వాటిని బయటకు పంపడం పూర్తిగా సాధ్యపడలేదు” అని చెప్పారు. 
 
“ఈ సరుకుల బ్యాచ్ మధ్యప్రాచ్య నిర్దేశాల ప్రకారం ప్రత్యేకంగా తయారు చేయబడింద. దీనివల్ల ఆర్డర్లను దారి మళ్లించడం కష్టంగా మారింది. మా నగదు ప్రవాహం ఇప్పటికే పూర్తిగా దెబ్బతింది,” అని ఆమె తెలిపారు. ఆమెకు తెలిసినంత వరకు, ఒక్క గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోనే దిగ్బంధనం కారణంగా వేలాది కంటైనర్లు చిక్కుకుపోయాయి. ఫలితంగా, అనేక కర్మాగారాలు ఆర్డర్ల డెలివరీలో అంతరాయాలు, నగదు ప్రవాహానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. 
 
చైనా విదేశీ వాణిజ్య రంగంలోని కోఆర్డినేటర్ ఒకరు మాట్లాడుతూ, ఇరాన్ యుద్ధం చైనా తయారీ పరిశ్రమపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని చెప్పారు. “ఫిరంగి గుళ్లకు కళ్లు ఉండవు. రవాణా, బీమా ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం సంస్థలకు ఉన్న ఏకైక కోరిక కాల్పుల విరమణ. లేకపోతే, చైనా ఎగుమతి వ్యవస్థ సమూల పతనాన్ని ఎదుర్కొంటుంది,” అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితి “అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల రంగంలో సీసీపీ నాయకత్వం తనంతట తానుగా ఒక క్లిష్ట పరిస్థితిలోకి కూరుకుపోయిందని, అది ఏ శక్తులైతే ఆదుకుందో, అవే ఇప్పుడు దాని సొంత ఆర్థిక జీవనాధారాలను తెంచుతున్నాయని” చూపిస్తోందని ఆమె పేర్కొన్నారు. జలసంధిని మూసివేయడం “ప్రపంచ లాజిస్టిక్స్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా, సీసీపీ భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక చట్రం పూర్తిగా కుప్పకూలడానికి పరాకాష్ట” అని చెప్పారు.