శాసనమండలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ సభ్యులు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు సోము వీర్రాజుపైకి దూసుకెళ్లారు. సోము వీర్రాజు మీదకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు వెళ్లారు. రాయలసీమ లిఫ్ట్‌పై మంత్రి రామానాయుడు సమాధానం పూర్తయినా వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు.
సమాధానం పూర్తైనందున తర్వాతి ప్రశ్నకు ఛైర్మన్ మోషేన్ రాజు అవకాశం కల్పించారు. ఛైర్మన్ అవకాశం కల్పించటంతో తర్వాతి ప్రశ్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేవనెత్తారు. ఛైర్మన్ తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సోము వీర్రాజు మీదకు వెళ్లారు. తాము నిరసన తెలువుతుంటే మైక్ ఎందుకు తీసుకున్నావ్ అంటూ సోము వీర్రాజు మీద దాడికి యత్నించారు.
ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు ఇజ్రాయిల్‌ను అనుసరించారు. మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ సోము వీర్రాజుకు మద్దతు వెళ్లి అడ్డుకున్నారు. ఉద్రిక్తత వాతావరణం మధ్య ఛైర్మన్ మోషేన్ రాజు సభను వాయిదా వేశారు. శాసనమండలిలో బిజెపి నేత సోము వీర్రాజుపై దాడి యత్నంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్యంత దురదృష్టకరం అని తెలిపారు.
ప్రజాస్వామ్య దేవాలయమైన సభలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దాడులకు దిగడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. సభా మర్యాదలు, నియమ నిబంధనలు పాటించడం ప్రతి సభ్యుడి బాధ్యత అని హితవు చెప్పారు. చైర్మన్ నిర్ణయాన్ని గౌరవించకుండా ఆగ్రహానికి లోనవడం తగదని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన హోదాను వైసిపి నేతలు దుర్వినియోగం చేయడం సరికాదని ధ్వజమెత్తారు.
బిజెపి శాసన మండలి పక్ష నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై అప్రజాస్వామికంగా వైసీపీ మండలి సభ్యులు వ్యవహారించారని బిజెపి మండిపడింది. వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ తో పాటు సోము వీర్రాజు మీదకు వెళ్లిన విధానాన్ని పరిశీలిస్తే వైసీపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు పై ఒక ప్రణాళిక ప్రకారం అయనపైకి దూసుకు వచ్చినట్లు గా కనపడుతోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
కేంద్ర మాజీ మంత్రి కావూరు కన్నుమూత
నీటి నిల్వకు ముందే పోలవరం నిర్వాసితులను తరలించాలి
మైమరిపించే విద్యుత్ కాంతుల్లో ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు