ఈ ఏడాది జనవరిలోనూ విదేశాలకు భారతదేశ వస్తు, సేవల ఎగుమతులు 13.16 శాతం పెరిగాయి. 2025 జనవరిలో భారత్ రూ.6.45 లక్షల కోట్ల ఎగుమతులు చేయగా, ఈ సంవత్సరం అదే నెలలో రూ.7.30 లక్షల కోట్లు విలువైన ఎగుమతులను సాధించింది. ఇక దిగుమతులు సైతం 18.77 శాతం పెరిగాయి. 2025 జనవరిలో విదేశాల నుంచి భారత్ రూ.6.94 లక్షల కోట్లు విలువైన వస్తు,సేవలను దిగుమతి చేసుకుంది.
2026 జనవరిలో మన దేశం చేసుకున్న దిగుమతుల విలువ మరింత పెరిగి రూ.8.24 లక్షల కోట్లకు చేరింది. ఈవివరాలను కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరిలో భారత్ రూ.94వేల కోట్ల (10.38 బిలియన్ డాలర్ల) వాణిజ్య లోటును ఎదుర్కొందని ఆయన తెలిపారు. 2025 జనవరిలో ఏర్పడిన రూ.48వేల కోట్ల (5.39 బిలియన్ డాలర్ల) వాణిజ్య లోటుతో పోలిస్తే ఇది రెట్టింపు అని పేర్కొన్నారు.
మొత్తం మీద విదేశాలకు వస్తు,సేవల ఎగుమతిలో భారత్ వేగం కొనసాగిందని రాజేశ్ అగర్వాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం (2025 – 2026)లో భారత్ మొత్తం ఎగుమతుల విలువ రూ.78 లక్షల కోట్లు (860 బిలియన్ డాలర్ల) దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇందులో ఒక్క సేవారంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువే రూ.37.19 లక్షల కోట్ల దాకా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్యకాలంలో రూ.61.59 లక్షల కోట్ల వస్తు,సేవల ఎగుమతులు చేసిన భారత్, 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి మధ్యకాలంలో రూ.65.38 లక్షల కోట్ల ఎగుమతులు చేసింది. స్థూలంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో (2025 ఏప్రిల్ – 2026 జనవరి) భారతదేశ ఎగుమతుల విలువ 6.15 శాతం పెరిగింది” అని తెలిపారు.
ఈ వ్యవధిలో అదనంగా రూ.3.62 లక్షల కోట్ల ఎగుమతులను మనం సాధించగలిగామని, వస్తు,ఉత్పత్తులతో పాటు సేవల ఎగుమతుల్లోనూ పురోగతిని నమోదు చేశామని వివరించారు. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంపై లీగల్ అగ్రిమెంట్‌కు అవసరమైన కార్యాచరణపై వచ్చే వారం వాషింగ్టన్ వేదికగా చర్చలు జరుగుతాయని రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి నెలాఖరు కంటే ముందే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పారు. కెనడాతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా భారత్ ముమ్మర కసరత్తు చేస్తోందని, దీనితో ముడిపడిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లకు భారత్, కెనడాల ప్రతినిధులు ఇప్పటికే తుదిరూపును ఇచ్చారని తెలిపారు.

More Stories
అమెరికా కోర్టులో విచారణకు మరింత సమయం కోరిన అదానీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 2 శాతం పెంపు
బంగ్లాదేశ్‌కు అదనంగా 5,000 టన్నుల డీజిల్ సరఫరా