మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ “బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు” పేరిట చార్జ్‌షీట్‌ను విడుదల చేసింది.
పేర్కొంటూ మున్సిపాలిటీల్లో సుమారు రూ.2,500 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూనే రెండున్నరేళ్లుగా అభివృద్ధి, మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెబుతూ కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు, పథకాలతోనే మునిసిపాలిటీలలో పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కేంద్ర నిధులు లేకపోతే తెలంగాణ మున్సిపాలిటీల పరిస్థితి ఏమైపోయేదో ప్రజలే ఆలోచించాలని కోరారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, రైతుబంధును బంద్ పెట్టారని, రుణమాఫీ, రైతు భరోసా వంటి కీలక హామీలు అమలు కాక రైతులు తీవ్రంగా మోసపోయారని పేర్కొన్నారు. భూవివాదాలను పెంచేలా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులను కొత్త సమస్యల్లోకి నెట్టిందని విమర్శించారు. విద్యారంగంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాంచందర్ రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్లకు చేరాయని, విద్యా భరోసా కార్డులు, బస్తీల్లో పాఠశాలల నిర్మాణం, ఐఐటిల ఏర్పాటు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, కొత్త నియామకాలు లేకుండా పాత నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానం అమలుకు నోచుకోలేదని తెలిపారు.
వైద్య రంగంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని రాంచందర్ రావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయాయని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు హామీలు అమలుకు దూరంగా ఉన్నాయని చెప్పారు.
రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా హామీ ఇచ్చి బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు చికిత్సలు నిరాకరిస్తున్నాయని, పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అన్ని మున్సిపాలిటీల్లో 100 పడకల ఆసుపత్రులు, ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ, ప్రసూతి ఆసుపత్రుల ఏర్పాటు హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మాట తప్పిందని విమర్శించారు. నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, అంగన్‌వాడీ వేతనాల పెంపు, ఎలక్ట్రిక్ స్కూటీల హామీలు అమలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని రాంచందర్ రావు గారు గుర్తుచేశారు. పేదలు, చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని తెలిపారు. ఇళ్లు, పెన్షన్లు, చేయూత పథకాలు హామీలకే పరిమితమయ్యాయని, వీధి వ్యాపారుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
కార్మికులు, యువతకు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలు జరగలేదని తెలిపారు. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, యువత ఆశలు అడియాశలయ్యాయని విమర్శించారు. ఎస్సి, ఎస్టీ, బిసి వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం, అసైన్డ్ భూములు, పోడు పట్టాల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు. సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు.
మతోన్మాదులు హిందూ దేవాలయాలను కూలగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఇప్పటివరకు దాదాపు 150 వరకు ఆలయాలను కూలగొట్టారని ఆరోపించారు. అయితే మతోన్మాదులు ఆలయాలపై దాడులు చేస్తే.. వారిని పిచ్చివారిగా చూపించి వదిలివేస్తోందని ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాల భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ఆక్రమణకు పాల్పడిన వారిలో పలువురు అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారని విమర్శించారు. గోరక్షకులపై కాల్పులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

More Stories
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!