రూ.15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి రూ.12,000కే పరిమితం చేశారని, అది కూడా ఒకే సీజన్‌కు మాత్రమే అని, మరో సీజన్‌కు సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని చెప్పారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, వరదల వల్ల పంట నష్టం జరిగినా సరైన పరిహారం అందలేదని విమర్శించారు.
శాసనసభ సాక్షిగా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క బిల్లును కూడా ఆమోదింపజేయలేదని మహేశ్వర్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 40 హామీలను నమ్మి ప్రజలు ఓటు వేయగా వాటి అమలుపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
యువతకు ఉద్యోగాలు లేవని, జాబ్ క్యాలెండర్ లేదని, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేఎల్పీ నేత తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళలకు నెలకు రూ.2,500, పెళ్లైన ఆడబిడ్డలకు బంగారం వంటి హామీలు అమలుకాలేదని ఆయన తెలిపారు.
సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చెబుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా కృష్ణా, గోదావరి బేసిన్లపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు ముందుకు రాలేదని ధ్వజమెత్తారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, చెరువులు, కుంటలు పాడైపోయాయని, పంపిణీ వ్యవస్థ అభివృద్ధి చేయకపోవడంతో అందుబాటులో ఉన్న సాగునీరు కూడా రైతులకు ఉపయోగపడటం లేదని ఆయన విమర్శించారు.
మహిళలు, విద్య, పంచాయతీరాజ్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకాలేదని స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్‌ను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెబుతూ కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశాలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు.
గృహ నిర్మాణ శాఖలో ఇళ్ల హామీలు అమలు కాలేదని, సామాజిక పెన్షన్లు సక్రమంగా ఇవ్వడం లేదని, రెవెన్యూ శాఖలో భూ సమస్యలు తీవ్రమయ్యాయని ఆయన వివరించారు. ధరణిలో లక్షల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో పాత అక్రమాలపై విచారణ చేయకుండా సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
విద్యుత్ రంగంలో సమస్యలు పెరుగుతున్నాయని చెబుతూ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమా? అని నిలదీశారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని చెబుతూ అనేక నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రులే లేవని, ఉన్న చోట్ల మందుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. బీపీ, షుగర్ వంటి సాధారణ మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తమైందని, అప్పులు విపరీతంగా పెరిగినా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరించి, ఫుట్‌బాల్ టోర్నమెంట్ల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం ఏ విధమైన న్యాయమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరం పూర్తిగా ఆగమాగమైపోయిందని, ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించలేని ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతోందని పేర్కొంటూ దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని చెబుతూ హోంశాఖను తన వద్దే ఉంచుకున్నప్పటికీ ప్రజలకు భద్రత కల్పించలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఆలయ శాఖ వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని ఆయన సవాల్ చేశారు.
ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి కార్మికులను ఎందుకు వేధిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ అంశంలో కోర్టుకు ఒక మాట, బయట మరో మాట చెబుతూ భూములను ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుతున్న వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వానికి ధైర్యం ఉందా? అని అడిగారు.
చేనేత కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని బీజేఎల్పీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని విచారణలు జరిగాయి? అదే అధికారులు కొనసాగుతుంటే చర్యలు ఎక్కడ జరిగాయని ఆయన ప్రశ్నించారు.

More Stories
ఎవరు ఎక్కువ మతోన్మాది, పెద్ద జిహాదీ అని పోటీపడుతున్నారా?
మత మార్పిడి రాకెట్ల నిర్మూలనకు కృత్రిమ మేధస్సు
భారత్ కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యమే