జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించింది.
హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.   ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీ, కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయంజాల్‌, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్‌, బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, నిజాంపేట్‌, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు. 
 
అంతేకాకుండా మరో డిస్కమ్‌ (విద్యుత్ పంపిణీ సంస్థ) ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని శ్రీధర్బాబు తెలిపారు. కొత్త డిస్కమ్‌ పరిధిలోకి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై, మిషన్‌ భగీరథ కనెక్షన్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కనెక్షన్లు, వ్యవసాయ కనెక్షన్లు వస్తాయని చెప్పారు. వచ్చే 10 సంవత్సరాల్లో విద్యుత్‌ డిమాండ్‌కు అవసరమైన ఏర్పాట్లపై చర్చినట్లుగా ఆయన వెల్లడించారు.
 
ఈ క్రమంలోనే 3వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.
 
రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కూడా నిర్ణయించారు. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.