ఢిల్లీ సూసైడ్ బాంబ‌ర్‌ డాక్ట‌ర్ ఉమ‌ర్ మ‌హ‌మ్మ‌ద్

ఢిల్లీ సూసైడ్ బాంబ‌ర్‌ డాక్ట‌ర్ ఉమ‌ర్ మ‌హ‌మ్మ‌ద్
 
దేశ రాజధాని ఢిల్లీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ కారు పేలుడు ఘటనలో ఈ ఘాతుకానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి, డాక్టర్ ఉమర్ మొహమ్మద్ తొలి ఫొటోను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. అయితే అతను ఈ పేలుడులో మరణించాడా లేక పరారీలో ఉన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫోరెన్సిక్ అధికారుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయెల్ ఆయిల్, ఇతర పేలుడు పదార్థాల మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ పోలీసు బృందాలు ఫరీదాబాద్‌లోని ఓ కాశ్మీరీ వైద్యుడి అద్దె ఇంటి నుంచి సుమారు 360 కిలోల అనుమానాస్పద అమోనియం నైట్రేట్ ను, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 
 
 ఢిల్లీలో జరిగిన పేలుడుకు, ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయి.  డాక్ట‌ర్ ఉమ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఆ దాడికి పాల్ప‌డి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలుపు రంగు హుందైయ్ ఐ20 కారులో ఉమ‌ర్ ఉన్న‌ట్లు భావిస్తున్నారు. ఆ సూసైడ్ బాంబ‌ర్‌కు చెందిన ఫోటో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న‌ది.

జ‌మ్మూక‌శ్మీర్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో వైట్ కాల‌ర్ టెర్ర‌ర్ మాడ్యూల్‌ను పోలీసులు బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. డాక్ట‌ర్ అదీల్ అహ్మ‌ద్ రాథ‌ర్‌, డాక్ట‌ర్ ముజ‌మ్మిల్ ష‌కీల్‌తో డాక్ట‌ర్ ఉమ‌ర్‌కు లింకు ఉన్న‌ట్లు తేల్చారు. అదీల్‌, ష‌కీల్‌ను అరెస్టు చేశారు. ఆ ఇద్ద‌ర్నీ అరెస్టు చేసిన‌ట్లు తెలుసుకున్న డాక్ట‌ర్ ఉమ‌ర్‌ ఫ‌రీదాబాద్ నుంచి త‌ప్పించుకున్నాడు.అయితే ఆందోళ‌న‌కు గురైన అత‌ను బ‌హుశా త‌న వాహ‌నాన్ని తానే పేల్చుకుని ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు.
మ‌రో ఇద్దరు వ్య‌క్తుల‌తో క‌లిసి ఉమ‌ర్ పేలుడు ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. కారులో డెటోనేట‌ర్‌ను పెట్టిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఎర్ర‌కోట వ‌ద్ద హుంద‌య్ ఐ20 కారు సుమారు మూడు గంట‌ల పాటు పార్కింగ్ చేసిన‌ట్లు గుర్తించారు. హెచ్ఆర్ 26సిఈ7674 వెహిక‌ల్ నెంబ‌ర్ ఉన్న ఆ కారు మ‌ధ్యాహ్నం 3.19 నుంచి సాయంత్రం 6.30 నిమిషాల వ‌ర‌కు ఫోర్ట్ వ‌ద్ద పార్కింగ్‌లో ఉన్న‌ది. పేలుడుకు ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో ఉంది. పార్కింగ్‌లో ఉన్న సమయంలో అందులోని అనుమానితులు ఒక్కసారి కూడా కిందకు దిగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పేలుడుకు సంబంధించి సూచనల కోసం వారు అక్కడ ఎదురుచూస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రాథ‌మిక విచార‌ణ త‌ర్వాత ఆ కారు అమ్మ‌కం జ‌రిగిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప‌లు మార్లు దాన్ని అమ్మిన‌ట్లు గుర్తించారు.

2025 మార్చిలో స‌ల్మాన్ అనే వ్య‌క్తి దేవేంద‌ర్‌కు ఆ కారును అమ్మాడు. కానీ ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 29వ తేదీన దేవేందర్‌నుంచి ఆమిర్ కారును కొనుగోలు చేశాడు. ఇక ఆమిర్ నుంచి డాక్ట‌ర్ ఉమ‌ర్ మొహ‌మ్మ‌ద్ కారు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.