ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూాటాన్ పర్యటనకు వెళ్లి ప్రధాని మోదీ, ఆ దేశ రాజధాని థింఫులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
“ఈ రోజు నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయానక ఘటన ప్రతి భారతీయుడిని విషాదంలో ముంచేసింది. బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను. దేశం మొత్తం ఈ కష్ట సమయంలో వారి పక్కనే ఉంది” అని తెలిపారు.
“సోమవారం రాత్రంతా దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులో ఉన్నా. పలు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడిస్తారు. కుట్రదారులను వదిలిపెట్టం. అమాయకుల ప్రాణాలు తీసిన వారందరికీ తగిన శిక్ష తప్పదు” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ పేలుడు ఘటనపై స్పందిస్తూ దేశంలోని ప్రముఖ విచారణ సంస్థలు త్వరితంగా, సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాయని తెలిపారు. ‘ఢిల్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఈ తీవ్రమైన విషాద సమయంలో దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు.

More Stories
పాక్ సరిహద్దు వెంట భవనాల కూల్చివేతకు ఆదేశం!
చరిత్ర సృష్టించిన వైభవ్.. 14 ఏళ్ల గేల్ రికార్డ్ బ్రేక్!
ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్