మొదటిసారి జైషే మహమ్మద్ కు మహిళా విభాగం

మొదటిసారి జైషే మహమ్మద్ కు మహిళా విభాగం
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన వ్యూహాలను మరింత విస్తరించడానికి కొత్త, పథకాన్ని రూపకల్పన చేసింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు ఎవరూ ఊహించని నష్టాన్ని చవిచూసింది. దాన్నిప్పుడు పూడ్చుకుని తమ ఉనికిని తిరిగి చాటుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఇందులో భాగంగానే మసూద్ అజార్ నేతృత్వంలోని ఈ సంస్థ తమ చరిత్రలో మొదటిసారిగా మహిళల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో మహిళలను సాయుధ, పోరాట మిషన్లలో పాల్గొనకుండా నిషేధించిన జైష్ సంస్థ ఇప్పుడు వ్యూహాత్మక మార్పును ప్రకటించింది.“జమాత్-ఉల్-మొమినాత్” పేరుతో ఈ మహిళా విభాగాన్నిఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 

దీని కోసం పాకిస్థాన్‌ లోని బహావల్‌పూర్‌లోని మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ కేంద్రంలో నియామకాలు ప్రారంభం అయ్యాయి. ఈ “జమాత్-ఉల్-మొమినాత్” విభాగాన్ని జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా విస్తరించాలని జైషే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే చదువుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంది.

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు మదర్సాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత బలగాలు పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లో సుమారు 100 కిలో మీటర్ల లోపల ఉన్న జైషే ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో జైషే తీవ్రంగా నష్టపోయింది.

ఈక్రమంలోనే మళ్లీ తమ ఉనికిని చాటుకోవడానికి జైషే మహిళా బ్రిగేడ్ ను ప్రారంభించబోతుంది.అయితే ఈ మహిళా విభాగానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ సోదరి సాదియా అజార్  నాయకత్వం వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత బలగాలు మార్కజ్ సుభానల్లా వద్ద జైషే  ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో మరణించిన యూసుఫ్ అజార్ భార్యే ఈ సాదియా అజార్.

ఈ ఉగ్రవాద సంస్థ తమ కమాండర్ల భార్యలను, అలాగే బహావల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మాన్‌సెహ్రాలోని తమ కేంద్రాలలో చదువుకుంటున్న ఆర్థికంగా బలహీనమైన మహిళలను తమ విభాగంలోకి చేర్చుకోవడం ప్రారంభించింది. సాధారణంగా జైషే మహ్మద్, లష్కరే తొయిబా వంటి సంస్థలు మహిళలను పోరాట కార్యకలాపాలకు దూరంగా ఉంచేవి.

కానీ ఐసిస్, బోకో హరామ్, హమాస్, ఎల్‌టిటిఇ వంటి ఇతర ఉగ్రవాద సంస్థలు మహిళలను ఆత్మాహుతి దాడి దారులుగా ఉపయోగించిన చరిత్ర ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్తులో జరిగే ఉగ్రవాద కార్యకలాపాల్లో జైషే కూడా  మహిళా ఆత్మాహుతి దాడులను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  మసూద్ అజార్, అతని సోదరుడు తల్హా అల్-సైఫ్ సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు, దీని ఫలితంగానే ప్రత్యేక మహిళా బ్రిగేడ్ ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి.