ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు

ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
దేశవ్యాప్తంగా కలకలంరేపిన హర్యానా అదనపు డీజీపీ వై పూరన్‌ కుమార్‌ (52) ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్‌ సింగ్‌ కపూర్‌, రోహతక్‌ ఎస్‌పీ నరేంద్ర బిజార్నియాలపై కేసు నమోదైంది. భారత న్యాయ సంహితతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద వీరిపై చండీగఢ్‌లోని సెక్టార్‌ 11 పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.  తన భర్త ఆత్మహత్యకు వీరిద్దరూ ప్రేరేపించారని ఆరోపిస్తూ పూరన్‌ కుమార్‌ భార్య, ఐఏఎస్‌ అధికారి అన్మీత్‌ కుమార్‌ గురువారం ఫిర్యాదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 108 కింద ఆమె తన ఫిర్యాదును అందచేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ (అత్యాచారాల నిరోధక) చట్ట నిబంధనలు కూడా ఈ సెక్షన్‌లోకి వస్తాయి.  తన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధ్యులైన ఇద్దరు సీనియర్‌ అధికారులను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాగా ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కొన్ని దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

ఈనెల 7న  చండీగఢ్‌లోని సెక్టార్‌ 11లోగల తన నివాసంలో కుర్చీలో కూర్చుని సర్వీస్‌ రివాల్వర్‌తో పేల్చుకుని పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. వీలునామాతోపాటు ఓ సూసైడ్‌ నోట్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌లో ఉద్యోగానికి సంబంధించి తాను ఎదుర్కొంటున్న సమస్యలు, అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన భార్య భర్త ఆత్మహత్య విషయం తెలుసుకోగానే వెంటనే తిరిగి వచ్చి తన భర్త కుల వివక్ష, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి లేఖ రాశారు.

ఆ మేరకు హరియాణా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తన భర్త ఆత్మహత్య ఉన్నత స్థాయి అధికారుల క్రమబద్ధమైన హింస ఫలితమని పేర్కొంటూ వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు తన భర్త మృతదేహం శవపరీక్షకు అనుమతిపబోమని ఆమె స్పష్టం చేశారు.  కాగా, దళిత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్యను జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. చండీగఢ్ ప్రధాన కార్యదర్శి, చండీగఢ్ పోలీసు డిజిపికి నోటీసు జారీ చేసి, ఏడు రోజుల్లోగా తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కోరింది.

మరోవైపు బుధవారం సాయంత్రం అమ్నీత్ కుమార్ తన భర్త పురాన్ కుమార్ రాసిన ఎనిమిది పేజీల ఆత్మహత్య నోట్ను చూపిస్తూ సెక్టార్ 11 చండీగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుల వివక్ష, వేధింపులు, తన భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

“నా భర్త మరణవార్త విని నేను జపాన్ నుంచి త్వరగా తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వ ప్రతినిధి బృందంలో నేనున్నాను. జపాన్ నుంచి వచ్చిన తర్వాత నా భర్త ల్యాప్‌ టాప్ బ్యాగ్‌ లో ఆత్మహత్య నోట్ రెండో కాపీ దొరికింది. నా భర్త ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనను నిరంతరం అవమాన పరిచారు. ఆయన కుల వివక్షకు గురయ్యారు” అని ఆమె వెల్లడించారు. 

“హరియాణా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్ తక్ ఎస్పీ రేంద్ర బిజార్నియా సూచనల మేరకు అర్బన్ ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌ లో తప్పుడు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసు నా భర్తను మరింత బాధపెట్టింది. ఈ విషయాన్ని డీజీపీ, ఎస్పీలతో చర్చించడానికి తన భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా ఆయన మనస్తాపంతో ఈ కఠినమైన చర్య తీసుకోవలసి వచ్చింది” అని ఆమె తెలిపారు. 

“నా భర్త ఆత్మహత్య నోట్ ను ఫిర్యాదును సమయంలో పోలీసులకు అందించాను. డీజీపీ, ఎస్పీ నా భర్తను వేధించి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు. దళిత కుటుంబం నుంచి వచ్చిన నా భర్త నిష్కళంకమైన సమగ్రత, అసాధారణ ప్రజా స్ఫూర్తి కలిగిన అధికారి.” అని పురాణ్ కుమార్ భార్య, ఐఏఎస్ అమ్మీత్ కుమార్ తెలిపారు. తన భర్తను సీనియర్ అధికారులు ఏళ్ల తరబడి క్రమబద్ధమైన అవమానం, వేధింపులు, హింసకు గురిచేశారని ఐఏఎస్ అమ్నీత్ కుమార్ ఆరోపించారు. పురాన్ చాలా సార్లు తనకు జరిగిన అవమానం, అన్యాయం, కుల వివక్ష గురించి పలుమార్లు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

ఒక ఉన్నత స్థాయి అధికారి ఆదేశాల మేరకు తనపై కుట్ర జరుగుతోందని పురాన్ కుమార్ తెలుసుకుని తనకు తెలియజేశారని ఆమె చెప్పుకొచ్చారు. తప్పుడు సాక్ష్యాలతో తనను ఓ కేసులో ఇరికించాడని ప్రయత్నిస్తున్నారని తన వద్ద వాపోయారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వై. పురాన్ కుమార్ (52) మంగళవారం చండీగఢ్ లోని సెక్టార్ 22 తన ఇంట్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.