ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య సమీప గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. పగ్లా గ్రామంలో భారీ పేలుడు సంభవించి ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయోధ్య జిల్లాలోని పూరా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పగ్లా గ్రామంలో గురువారం సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది.
ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని ఐదుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ అధికారులు, రక్షణ బృందాలు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. బుల్డోజర్ సహాయంతో శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ఘటన జరిగిందని అంచనా వేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి తగిన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అటు ఈ ఘటనపై ఆరా తీసి మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపిన వివరాల ప్రకారం “సాయంత్రం సుమారు 7:15 గంటలకు గ్రామం వెలుపల ఉన్న ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయిందని సమాచారం అందింది. ఆ సమయంలో భారీ శబ్దం వినిపించింది. వెంటనే పోలీసు, రెస్క్యూ టీమ్‌లు చేరి శిథిలాలను తొలగించడం ప్రారంభించాయి. ఆసుపత్రి వర్గాల ప్రకారం ఐదుగురు మరణించినట్లు నిర్ధారించారు. ప్రాథమికంగా చూస్తుంటే వంటగది పరిసరాలు ధ్వంసమై, అక్కడే పైకప్పు కూలినట్లు కనిపిస్తుంది”.
పేలుడుకు గల కారణాలపై స్పష్టత రాలేదు. తొలుత బాణాసంచా పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించినా, పోలీసులు గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. “వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ పేలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం చెప్పగలం” అని జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారామ్ ఫుండే మీడియాకు తెలిపారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో తనిఖీలు చేస్తోంది.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!
ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు