ఈ ఏడాది జార్ఖండ్‌లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. వాతావరణ మార్పుల వల్ల సంభవించిన భారీ వర్షాలకు ఈ ఏడాది 458 మంది మృతి చెందారని తాజాగా రాంచీ వాతావరణశాఖ కేంద్ర డైరెక్టర్ అభిషేక్ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు 1,199.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 18 శాతం ఎక్కువ. విపరీతంగా కురిసిన వర్షాల వల్ల 467 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక పాక్షికంగా 8 వేల ఇళ్లు దెబ్బతెన్నాయి.
రాంచీ, గుమ్లా, లోహర్‌దాగా, సిమ్‌దేగా జిల్లాల్లో 2,390 హెక్టార్ల పంట నష్టపోయింది. ఒక్క సాహిబ్‌గంజ్‌లోనే గంగా నది నీటిమట్టం పెరగడం వల్ల దాదాపు 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. కాగా, ఈ నేపథ్యంలో రాంచీ వాతావరణ కేంద్ర డైరెక్టర్ అభిషేక్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ “గత దశాబ్దంలో రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షపాతం. చివరగా 2016లో 1,101.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనితో పోల్చినా ఈ ఏడాది కురిసిన వర్షపాతం (1,199.5 మి.మీ) ఎక్కువ” అని చెప్పారు.
“వాతావరణ మార్పు, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అల్పపీడన కదలికలు కూడా జార్ఖండ్‌వైపు కదిలాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో అసాధారణంగా ఏర్పడిన అల్పపీడనాల వల్ల తూర్పు, ఆగేయ జిల్లాల్లో తరచూ భారీ వర్షాలు కురిశాయి” అని ఆయన పేర్కొన్నారు.
జార్ఖండ్‌లో 1,669.5 మి.మీ వర్షపాతంతో తూర్పు సింగ్‌భూమ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో సరైకేలా – ఖర్సవాన్ 1,526.3 మి.మీ, రాంచీ 1,550.2 మి.మీతో నిలిచాయి. వర్షపాతం తగ్గుముఖం పట్టినప్పటికీ అక్టోబర్ 12 వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

More Stories
తీవ్రవాద ముప్పు హెచ్చరికలతో ఢిల్లీలో అప్రమత్తం
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ఎంఆర్ఐవి’ విజయవంతంగా ప్రయోగం
ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర భగ్నం