ఆధార్ ను ఐడీ ప్రూఫ్ గా ఆమోదించాల్సిందే

ఆధార్ ను ఐడీ ప్రూఫ్ గా ఆమోదించాల్సిందే

బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటర్ల గుర్తింపును నిర్ధరించడానికి ఆధార్‌ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆధార్‌ వాస్తవికతను పరిశీలించిన తర్వాతనే ఓటరు నిర్ధరణకు వినియోగించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఆధార్‌ ద్వారా నిజమైన పౌరులను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. నకిలీ పత్రాల ఆధారంగా నిజమైన పౌరులని చెప్పుకునే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఓటర్ల ధ్రువీకరణకు ఆధార్‌ను అధికారులు ఎందుకు స్వీకరించట్లేదని గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ధర్మాసం ఆదేశించింది. 

బిహార్‌లో ఓటరు నిర్ధారణ కోసం ప్రస్తుతం 11 పత్రాలను పౌరులు సమర్పిస్తున్నారు. ఆధార్‌ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అయితే ఆధార్‌ పౌరసత్వానికి మాత్రం ధ్రువీకరణ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ వలసదారుల సమస్య దృష్ట్యా, అవసరమైన వేళ ఎన్నికల కమిషన్‌ సదరు ఆధార్‌ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చని వెల్లడించింది.

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), ఏఐఎంఐఎం, ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ల వాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్‌ కార్డును కూడా కమిషన్‌ ప్రకటించిన ధ్రువీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని పేర్కొంది. 

ఇది 1950 నాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ జాబితాలో పాస్‌పోర్టు, బర్త్‌ సర్టిఫికెట్‌ వంటి 11 పత్రాలను ఐడీ ప్రూఫ్‌లుగా ఎలక్షన్ కమిషన్ స్వీకరిస్తోంది. కనుక తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో ఆధార్ ధ్రువీకరణ పత్రం ఆమోదయోగ్యమే అని తెలుపుతూ ఓ నోటీసులు ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సూచించింది.

అంతకు ముందు ఎలక్షన్ కమిషన్ తరఫున రాకేష్‌ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ ఈసీ ఆధార్‌ను ప్రూఫ్‌గా స్వీకరించడానికి అంగీకరించినా, పిటిషనర్లు దానిని 12వ గుర్తింపు పత్రంగా చేర్చమని కోరడం దేనికని ప్రశ్నించారు. పౌరసత్వ ధ్రువీకరణ విషయంలో పాస్‌పోర్టుకు ఉన్న విలువ ఆధార్‌కు లేదని ఆయన చెప్పారు. అలాంటప్పుడు దానిని ఆ జాబితాలో ఎలా చేరుస్తామని ప్రశ్నించారు.