
తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 8 స్థానాలు దొంగ ఓట్ల వల్లే వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఆరోపణల పట్ల బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఎంపీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీపై ఎద్దేవా చేస్తూ, దొంగ ఓట్లపై మాట్లాడటానికి వారికే హక్కు లేదని పేర్కొన్నారు. గతంలో అటువంటి తంత్రాలు ఎక్కువగా కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని ఆమె గుర్తుచేశారు.
“దొంగ ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్ కే ఉంది. ఓటమి ఎదురైనప్పుడే వారికి ఫేక్ ఓట్లు గుర్తుకొస్తాయి” అంటూ ఆమె మండిపడ్డారు. ఒకే సమయంలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు గెలిచాయని ఆమె గుర్తు చేస్తూ అలాంటప్పుడు దొంగ ఓట్ల వల్ల బీజేపీ మాత్రమే గెలిచిందని ఎలా చెబుతారు? అంటూ ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ల మధ్య నలిగిపోయిన మహేష్ గౌడ్ నిరాశతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని డీకే అరుణ ఆరోపించారు. “బలహీన వర్గాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని తొలగించి, మహేశ్ కుమార్ గౌడ్‌ను ముఖ్యమంత్రిని చేయాలి” అని అరుణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ, “అధికారం తలకెక్కి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు” అంటూ ఆమె ధ్వజమెత్తారు.
తెలంగాణలో దొంగ ఓట్లుంటే ఆ జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు? 20 నెలలుగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా దొంగ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు? అని బిజెపి శాసనసభ పక్ష ఉపనాయకుడు పాయల శంకర్ ప్రశ్నించారు. దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ 8 మంది ఎంపీ సీట్లను గెలిచిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు నిజంగా దమ్ముంటే తెలంగాణలోని దొంగ ఓట్లను తొలగించాలని సవాల్ చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ చేసిన “ఓటు చోరీ” ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఈ ఆరోపణలను అసత్యం, బాధ్యతారాహితం, కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే నిరాశాజనక ప్రయత్నంగా బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ అభివర్ణించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌పై మహేష్ గౌడ్ చేసిన వ్యక్తిగత విమర్శలు బాధ్యతారాహిత్యం మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నాయకుడి నిరాశా, అసహనంని కూడా బయటపెట్టాయని ఆయన దుయ్యబట్టారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం కరీంనగర్ జిల్లాలో జనహిత యాత్రలో మాట్లాడుతూ, బీజేపీ గెలుపులు న్యాయబద్ధమైనవిగా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. “కరీంనగర్‌లో బండి సంజయ్ గెలుపు పూర్తిగా ఆదొంగ ఓట్ల వల్లే సాధ్యమైంది. తెలంగాణలోని ఇతర ఎనిమిది బీజేపీ ఎంపీల గెలుపు కూడా ఇదే తరహాలో జరిగిందేమో అన్న అనుమానం ఉంది” అని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రజల మద్దతుతో కాకుండా దొంగ ఓట్ల సహాయంతో అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు