ఉంటే ఆధారాలివ్వు.. లేదంటే క్షమాపణ చెప్పు రాహుల్

ఉంటే ఆధారాలివ్వు.. లేదంటే క్షమాపణ చెప్పు రాహుల్
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని, అధికార బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలను అర్థం పర్థం లేనివిగా అభివర్ణించింది. రాహుల్‌గాంధీ తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే తన సంతకంతో ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేనిపక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం కౌంటర్‌ ఇచ్చింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరు ఉండటం, ఉనికిలో లేని చిరునామాలలో ఓటర్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్‌పై వందలాది ఓట్లు ఉండటం, ఫొటోలు సరిగా లేని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం లాంటి అనేక అవకతవకలను తాము తమ సర్వేలో గుర్తించామని తన ప్రజెంటేషన్‌లో రాహుల్‌గాంధీ వివరించారు.

అదేవిధంగా అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి నిరాకరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలో లక్ష కంటే ఎక్కువ దొంగ ఓట్లున్నాయి. ఎన్నికల సంఘం బిజెపితో కుమ్మక్కైందని రాహుల్‌ ఆరోపించారు. 

40 మందితో కూడిన బృందం ఆరు నెలలపాటు నిర్వహించిన విశ్లేషణలో వేలాది నకిలీ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు చెల్లని ఫొటోలు, అనుమానాస్పద ఫారం 6 దరఖాస్తులు బయటపడ్డాయి అని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. “రాహుల్ గాంధీ తన విశ్లేషణకు, ఈసీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణ పత్రంపై సంతకం చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఒకవేళ సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణను నమ్మడం లేదన్నట్టు. అప్పుడు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలి” అని ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

కాగా, ఎన్నికల కమిషన్ స్పందనపై వ్యాఖ్యానిస్తూ పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ లో రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఇదివరకే తాను ప్రమాణం చేసానని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో “ఓటు చోరి మోడల్” ఉపయోగించారని ఆరోపిస్తూ, “మనం ఎంతో ఇష్టపడే ప్రజాస్వామ్యం ఇప్పుడు లేదు” కాబట్టి న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. పరిశోధన ద్వారా కాంగ్రెస్ సేకరించినది “నేరపూరిత ఆధారాలు” అని, దేశవ్యాప్తంగా అటువంటి ఆధారాలను పోల్ కమిషన్ నాశనం చేయడంలో బిజీగా ఉందని గాంధీ ఆరోపించారు.