సామాజిక సమానత్వంలో 4వ స్థానంలో భారత్‌

సామాజిక సమానత్వంలో 4వ స్థానంలో భారత్‌
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచిన భారత్‌.. అత్యంత సామాజిక సమానత్వం ఉన్న దేశాల్లోనూ నాలుగో స్థానంలో నిలిచింది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సహా 167 దేశాల కంటే మెరుగైన స్థానం సంపాదించింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘జీని ఇండెక్స్‌’ నివేదికను ఉటంకిస్తూ కేంద్ర సామాజిక, సంక్షేమ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
 
పేదరికాన్ని తగ్గించే చర్యలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ఈ సమానత్వం సాధ్యమైందని పేర్కొంది. మొత్తం 171 దేశాలతో కూడిన జీని ఇండెక్స్‌లో భారత్‌ 25.5 పాయింట్లతో స్లోవాక్‌ రిపబ్లిక్‌ (24.1), స్లొవేనియా(24.3), బెలారస్‌ (24.4) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపింది. భారత స్కోరు 2011లో 28.8 పాయింట్లుగా ఉండగా.. 2022 నాటికి 25.5 పాయింట్లకు మెరుగుపడిందని వివరించింది (తక్కువ స్కోరు ఉంటే తక్కువ అసమానతలు).
 
జీని ఇండెక్స్‌లో యూకే (32.4) చైనా (35.7), యూఎస్ఏ (41.8) మనకన్నా వెనుకబడ్డాయని పేర్కొంది. ‘‘భారత ఆర్థిక పురోగతి పౌరుల మధ్య సమానంగా ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పేదరికం తగ్గింపు, విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు, జన్‌ధన్‌ యోజన, ఆధార్‌ వంటివాటితో నేరుగా సంక్షేమ పథకాల నగదు బదిలీ, ఆయుష్మాన్‌ భారత్‌తో వైద్య సదుపాయం వంటివి దీనికి కారణం” అని సామాజిక సంక్షేమశాఖ ప్రకటనలో పేర్కొంది.
 
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 2011 నుంచి 2023 మధ్య 17.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికం 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది. ముఖ్యంగా, జనధన్ యోజన కింద 55 కోట్లకు పైగా ఖాతాలు తెరవడం, ఆధార్ ఆధారిత డీబీటీ ద్వారా 142 కోట్ల మందికి నిధులు పంపిణీ చేయడం ఈ మార్పును తీసుకువచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రూ.3.48 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. లబ్ధిదారులకు నేరుగా నిధులు చేరడంతో ముడుపులకు చోటు లేకుండా మారింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 41 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ లభించింది. అలాగే, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం అందడం సమానత పెంపుకు తోడ్పడింది.