తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఆధారంగా ఆయన భారత పౌరుడు కాదని తేలింది. దీంతో ఎన్నికల అధికారులు అతని పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు.

ఈ అంశంపై అధికారులు మరింత స్పష్టత ఇస్తూ చెన్నమనేని నివాసానికి నోటీసులు అంటించారు. అందులో ఆయన పౌరసత్వం చెల్లదని, ఓటరుగా కొనసాగడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ నోటీసుకు ఇంకా చెన్నమనేని నుంచి స్పందన రాలేదు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అధికారులు ఇదే విషయంపై నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వకపోవడంతోనే తాజా చర్యల్ని చేపట్టారు. 

ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్ ఈ వివాదంపై గతంలోనే కోర్టును ఆశ్రయించారు. ఆయన సాగించిన న్యాయపోరాటమే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ తీర్పును అమలు చేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. దానికనుగుణంగానే చెన్నమనేని పేరును ఓటరు జాబితా నుంచి తొలగించారు.

ఒక వ్యక్తి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం సాధారణమే. కానీ, పౌరసత్వ వివాదం వల్ల ఓటు హక్కును కోల్పోవడం మాత్రం అరుదైన పరిణామం. ఇది దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా జరగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చట్టసభలో నాలుగు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన నేత ఓటరు కాదు అనడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన మొదట టిడిపి ఎమ్యెల్యేగా, ఆ తర్వాత బిఆర్ఎస్ ఎమ్యెల్యేగా గెలుపొందారు.