సంపద కొందరు ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతం

సంపద కొందరు ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతం
దేశంలో పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, సంపద కొందరు ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నదని పేర్కొంటూ ఇది ప్రమాదకరమైన పరిస్థితని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొంటూ సమాజంలో సంపద వికేంద్రీకరణ జరగాలని స్పష్టం చేశారు. సంపద అంతా కొద్దిమంది వద్దే కేంద్రీకృతం కావొద్దని, ఉపాధిని సృష్టించే, గ్రామాలను అభివృద్ధి చేసే ఆర్థిక వ్యవస్థ కోసం మనం కృషి చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో 65 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్న ఆయన దేశ జీడీపీకి ఈ రంగం సహకారం 12శాతం మాత్రమేనని చెప్పారు. పరిశ్రమ రంగం సహకారం 22 నుంచి 24 శాతం, సేవారంగం సహకారం 52 నుంచి 54 శాతం ఉందని గడ్కరీ తెలిపారు.  కేంద్రమంత్రి తన ప్రసంగంలో మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక విధానాలను ప్రసంసించారు. నియంత్రణ లేకుండా కేంద్రీకరణ గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

స్వామి వివేకానందను ఉటంకిస్తూ కడుపు ఖాళీగా ఉన్న వ్యక్తికి తత్వశాస్త్రం బోధించలేమని తెలిపారు. చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్రపై మాట్లాడుతూ సీఏలు కేవలం పన్ను ట్యాక్స్‌ రిటర్న్‌లను దాఖలు చేయడానికి పరిమితం కాదని, దేశ ఆర్థిక వ్యవస్థనకు ఇంజిన్‌గా మారగలరని పేర్కొన్నారు.  రోడ్డ నిర్మాణరంగంలో జరిగిన పనిపై ప్రస్తావిస్తూ బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బిఓటి) వ్యవస్థను మొదటగా ప్రారంభించిన వ్యక్తి తానేనని గుర్తు చేశారు. నేడు రోడ్డు అభివృద్ధికి డబ్బు కొరత లేదని గడ్కరీ పేర్కొన్నారు. టోల్ ద్వారా మనం ఏటా రూ.55వేల కోట్లు సంపాదిస్తున్నామని, రెండేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని వివరించారు.