ఆమ్ ఆద్మీపార్టీ సారథ్యంలోని పంజాబ్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని రాజ్యసభ ఎంపి రాఘవ చద్దా విమర్శించారు. స్వచ్ఛందంగా ఆప్ వదిలి ఇటీవలే బిజెపిలో చేరిన ఎంపిలపై రాజకీయ దురుద్ధేశపూరిత చర్యలకు దిగుతున్నారని, ఇందుకు పంజాబ్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తున్నారని పేర్ కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు.
మరో ముగ్గురు ఎంపీలతో కలిసి రాఘవ్ చాధా మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మూడింట రెండు వంతుల ఎంపీలు బీజేపీలో విలీనమవ్వడాన్ని రాజకీయ పునరేకీకరణగా అభివర్ణిస్తూ, తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకున్నందుకు తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ ప్రతినిధి బృందం రాష్ట్రపతికి తెలియజేసిందని తెలిపారు.
“ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎంపీలపై పంజాబ్ ప్రభుత్వం ప్రమాదకరమైన కక్షపూరిత రాజకీయాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా వాడుకుంటోందో ఈరోజు మేము రాష్ట్రపతికి తెలియజేశాము. ప్రపంచ కప్ విజేత హర్భజన్ సింగ్ నివాసం బయట పంజాబ్ పోలీసుల సహాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ‘దేశద్రోహి’ అని రాశారు. దీని తర్వాత, పంజాబ్‌లో పద్మశ్రీ రాజేంద్ర గుప్తా ఫ్యాక్టరీకి నీటి కనెక్షన్‌ను నిలిపివేశారు” అని వారు తెలిపారు.
“ఆమ్ ఆద్మీ పార్టీ సందీప్ పాఠక్‌పై దురుద్దేశపూర్వకంగా, కల్పితంగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి, అతడిని అరెస్టు చేస్తారని మీడియాలో ప్రచారం చేసింది,” అని రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాధా పేర్కొన్నారు. విజిలెన్స్ బోర్డు, కాలుష్య నియంత్రణ బోర్డుల సహాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రమాదకరమైన ప్రతీకార క్రీడను ప్రారంభించిందని పేర్కొంటూ దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
“విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వారి తదుపరి లక్ష్యం నేనే. సోషల్ మీడియాలో మమ్మల్ని బెదిరించడానికి పంజాబ్ ప్రభుత్వం ఏజెన్సీలను నియమించింది. పంజాబ్ ప్రభుత్వ నిధులను ఉపయోగించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇది చేస్తుంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపరులు, రాజీపడిన వారి చేతుల్లో చిక్కుకుందని నేను చెప్పాను,” అని ఆయన ధ్వజమెత్తారు.
పలువురు ఎంపీల ఇండ్ల వద్దకు పోలీసులు వెళ్లడం, వారిని భయభ్రాంతులను చేయడం దారుణం అని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చద్దాతో పాటు ముగ్గురు ఎంపీలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. తాము ఆప్ నాయకత్వం వైఖరితో విభేధించి బయటకు వచ్చామని, ఈ దశలో తాము రాజ్యాంగపరమైన హక్కును వాడుకున్నామని , అసంతృప్తి భావ వ్యక్తీకరణకు దిగామని, దీనిని సహించలేక దాడులకు దిగడం దారుణం అని చద్దా విమర్శించారు.

More Stories
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!
బిజెపి గెలుపు తర్వాత తెరుచుకున్న అసన్సోల్ దుర్గా ఆలయం
ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూత