చట్టంగా మారిన వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు

చట్టంగా మారిన వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కలల బిల్లు చట్టంగా మారింది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణల కోసం తీసుకొచ్చిన వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాల మధ్య ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చింది. ఈ సందర్భంగా ప్రజలెప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడూ చూడలేదని ట్రంప్‌ పేర్కొన్నారు.
 
ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందని, సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు.  ఈ విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం అమెరికా రాజకీయాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులకు ఇది లాభదాయకమైనప్పటికీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక రంగం నష్టపోనున్నాయి. అదేవిధంగా లక్షలాది మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోనున్నారని చెబుతున్నారు. ఇందులో విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. 
 
కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులను కూడా నిలిపివేయనున్నారు. ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఈ చట్టం అమలులోకి రావడంతో బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిచిపోయాయి.
 
ఈ చట్టం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని ట్రంప్, రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు. అయితే దీని కారణంగా దేశ అప్పు మరో 3 ట్రిలియన్ డాలర్ల మేరకు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ విశ్లేషణలను రిపబ్లికన్లు కొట్టిపారేశారు.