
తెలంగాణలో యూరియా కొరతపై రైతుల్లో అపోహలు కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్‌ఎస్ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని జరుపుతున్నట్లు మహబూబ్‌నగర్ ఎంపి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన వల్లే ఏర్పడిందని ఆమె ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేకపోయినా, ఒక్క తెలంగాణలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దారుణమని ఆమె ధ్వజమెత్తారు. సరఫరా, నిల్వల ప్రణాళికలో వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు సరఫరా, నిల్వల ప్రణాళికపై వైఫల్యం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.
ఎరువుల విషయంలో రాష్ట్ర రైతులు ఎలాంటి అపోహలో పడొద్దని, ఈ రబీ సీజన్‌కు రాష్ట్రానికి అవసరమైన యూరియాను కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసిందని అరుణ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి అవసరం 9.5 లక్షల మెట్రిక్ టన్నులైతే కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా పంపిందని ఆమె గుర్తు చేశారు. ఇదే కాకుండా డీఏపీ, ఎన్‌పికెఎస్ వంటి అన్ని ఎరువులూ రాష్ట్ర అవసరానికి మించి పంపించామని ఆమె చెప్పారు.
డీఏపీ కోసం 1.47 లక్షల టన్నులు అవసరం ఉండగా, 1.72 లక్షల టన్నులు పంపించడమే దీనికి ఉదాహరణ అని ఆమె తెలిపారు. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర అవసరాలను అంచనా వేసి అధికంగా సరఫరా చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని అరుణ విమర్శించారు.
మార్క్‌ఫెడ్ దివాళా తీసిందని చెబుతూ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను రైతులపై మోపడం, కొన్ని కోఆపరేటివ్ సంఘాల్లో ఎరువులు నిల్వ వేసి బ్లాక్ మార్కెట్‌కు తిప్పడంపై ఆరోపణలు రావడం ఈ పరిస్థితికి నిదర్శనం అంటూ ఆమె మండిపడ్డారు. అసలు సమస్య రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని పేర్కొంటూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం అనైతిక చర్యగా ఆమె అభివర్ణించారు.
More Stories
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్
తెలంగాణలో యూరియా కొరత రావొద్దు