
వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అనేక పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్ కేస్ బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అబూబకర్ సిద్ధిఖీ అలియాస్ అమానుల్లా ఆయన భార్య షేక్ సైరాబానుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరో కేసులో ఉగ్రవాది షేక్ మన్సూర్ అలీ ఆయన భార్య షమీం పైన ఇవే సెక్షన్లు వర్తింపజేస్తూ కేసులు నమోదు చేశారు.
ఉగ్రవాద సోదరుల కేసులో తమిళనాడు పోలీసుల వివరాల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఐసిస్, అలూమా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయని చెబుతూ నిందితులకు సహకరిస్తున్న వారిపై విచారణ చేస్తున్నామని, అలానే నిందితుల వద్ద పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నిందితుల ఇళ్లలో దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామగ్రి స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వెల్లడించారు. తమిళనాడు జైలులో అసలు నిందితులు ఉన్నారని వారిని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఐదేళ్ల క్రితం అబూబకర్ సిద్దిఖీ రాయచోటి యువతిని పెళ్లి చేసుకున్నాడని, అదే విధంగా 10 ఏళ్ల క్రితం మహమ్మద్ అలీ గాలివీడు యువతిని పెళ్లి చేసుకున్నాడని డీఐజీ వెల్లడించారు.
వీరంతా బాంబుల తయారీలో నిందితులు నిమగ్నమయ్యారని తెలిపారు. అలూమా దక్షిణ భారత్‌లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. రాయచోటికి వచ్చాక బెంగళూరు మల్లేశ్వరం పేలుళ్లలో ఇద్దరూ నిందితులుగా ఉన్నారని తెలిపారు. వారి ఇళ్లలో సోదాలు చేసినప్పుడు 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయని, ఇంక బాంబుల తయారీకి అవసరమైన సామగ్రి అంతా లభ్యమైందని డీఐజీ వివరించారు.
రాయచోటిలో నియామకాలు, శిక్షణ ఇచ్చినట్లు విచారణలో నిర్ధారణ కాలేదని పేలుడు సామగ్రి ఎలా వచ్చిందనేదానిపై విచారణ చేపడుతున్నామని డీఐజీ చెప్పారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పని చేస్తున్నాయని 20 ఏళ్లు అయినా చట్టం నుంచి తప్పించుకోరనడానికి ఇది ఒక నిదర్శనమని వెల్లడించారు.
రాయచోటిలో 30 ఏళ్లుగా స్థావరం ఏర్పాటు చేసుకుని విధ్వంసం సృష్టించే అతి ప్రమాదకరమైన బాంబులు తయారు చేయడంలో అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ ఉగ్రవాదులు సిద్ధహస్తులను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. స్వాధీనం చేస్తున్న వేలుడు పదార్థాల ద్వారా 50 నుంచి 60 బాంబులు తయారు చేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. వారం రోజుల్లోనే తమిళనాడులో ఉన్న ఉగ్రవాదులను పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తామని తెలిపారు.
కాగా, విజయనగరం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉగ్ర లింకులు బయటపడటంపై హోమంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులు బయటపడటానికి గత ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఆమె ఆరోపించారు. ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఉండటం వలన దర్యాప్తు మరింత లోతుగా జరుగుతుందని తెలిపారు.
More Stories
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!