
చలసాని నరేంద్ర
అత్యవసర పరిస్థితి అమలు జరిపి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో నిర్బంధించిన మీసా డిటెన్యూలైన ఆర్‌ఎస్‌యూ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి, విరసం నేత వరవరరావులు వరుసగా రెండు రోజులపాటు `ఆంధ్రజ్యోతి’లో వ్యక్తపరచిన అనుభవాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించాలను కొంటున్నాను.
వెంకటరమణి చెప్పిన్నట్లు లెఫ్ట్, రైట్ వంటి విబేధాలు లేకుండా, చివరకు ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామి హింద్, ఆనంద్ మార్గ్ వంటి వారంతా కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఉండేవాళ్ళం. అయితే 50 ఏళ్ళు గడిచి పోవడంతో కొన్ని జ్ఞాపకాలు మసకబారి ఉండవచ్చు. వరవరరావు చెప్పినట్లు చెరబండరాజును మాజీ కేంద్ర మంత్రి ఆలే నరేంద్ర వెనుకగా వచ్చి కర్రతో కొట్టారనడం, తిరిగి నరేంద్రపై దాడి చేశారనడం వాస్తవం కాదు. అటువంటి సంఘటన జరిగినట్లు గుర్తు లేదు. నరేంద్ర తోటి ఖైదీలతో ఎప్పుడూ ఘర్షణలకు పాల్పడిన్నట్లు గుర్తులేదు. జైలులో ఉమ్మడిగా ఎటువంటి కార్యక్రమం జరపాలన్నా ఆయనే ముందుంటే వారు.
వందేమాతరం పాటతో కోపగించుకున్నారనడం కూడా వాస్తవం కాదు. వాస్తవానికి భారత మాతను కించపరుస్తూ పాడడంతో పాతబస్తీకి చెందిన శివాజీరావు పవర్ ఆగ్రహంతో నిలదీసాడు. ఆ సమయంలో సాయంత్రం వంటపాత్రలు ఇచ్చే దగ్గర జరిగిన వాగ్వివాదంలో వరవరరావు వంటచేసి పేనంపై కాలు వేయడంతో కోపం పట్టలేక, అన్నవండే దానిపై కాలు వేస్తావా? అంటూ అందరూ ఉండగానే చెంపపై చేతితోనే కొట్టాడు. దానితో “ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను చంపేస్తున్నారు” అంటూ భయంతో మరో బ్యారక్ లోకి పరిగెత్తుకు పోవడంతో కొంత అలజడి జరిగింది. ఆ ఘటన తప్ప మరెప్పుడు ఈ విధమైన ఘర్షణలు జరగనే లేదు.
వీరిద్దరూ పేర్కొన్నట్లు భావజాలంను బట్టి అక్కడ మెస్ లు ఏర్పడలేదు లేవు. వాస్తవానికి భావజాలాలు బట్టి కాకుండా వ్యక్తిగత అహంకారాలతో ఎక్కువగా వివాదాలు చెలరేగుతూ ఉండెడివి. స్వాతంత్ర్య పోరాటంలో తన జైలు జీవితం గురించి వ్రాస్తూ టంగుటూరి ప్రకారం `నేను జైలులో పెద్దవారి చిన్న మనస్సులను, చిన్నవారి పెద్ద మనసులను చూసాను’ అన్నారు. అంటే, బయట ఎంతో ప్రఖ్యాతులైన వారు జైలులో చిన్న చిన్న విషయాలలో సంకుచితంగా, మొండిగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక్కడ కూడా అటువంటి ఘటనలు కొన్ని జరిగినా కొట్లాటలు వరకు వెళ్ళలేదు.
మొదట్లో అందరికీ ఒకే మెస్ లో వంటచేసేవారు. ఆ మెస్ ను సిపిఎం ఎంఎల్ గ్రూప్ కు చెందిన సుబ్బారావు (తెనాలి) పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఆయన సారథ్యంలోనే నిర్వహణ జరిగెడిది. వారానికి రెండు సార్లు మాత్రం మాంసాహారం చేసేవారు. అయితే నావంటి కొందరు యువకులం ప్రతిరోజూ మాంసాహారం ఉండాలని అంటూ, వేరే మెస్ పెట్టుకుంటామని ప్రతిపాదించాము. ఈ విషయమై కొద్దీ రోజులు వాడిగా, వేడిగా చర్చలు జరిగాయి. చివరకు సోషలిస్టులు, కొందరు ఆర్ఎస్ఎస్, ఇతర భావజాలం గలవారంతా కలిసి విడిగా మరో మెస్ పెట్టుకున్నాం.
ప్రతిరోజూ అందరం కలిసి చర్చా గోష్ఠులు నిర్వహించు కొనేవాళ్ళం. ఆ పక్రియలోనే తరిమెల నాగిరెడ్డి గారి మరణం సందర్భంగా సంతాప సభ జరిగింది. జైలులో ఉన్న ఆయన శిష్యులు ఆయన మరణ వార్త వినగానే బోరున విలపించారు. ఆ సభలో ఆర్ఎస్ఎస్ జేష్ఠ ప్రచారక్ వి ఎల్ దేశముఖ్ మాట్లాడటం అందరికి ఆశ్చర్యం కలిగించింది. జైలులో ఉన్నవారందరిలో ఆయనకే నాగిరెడ్డితో సన్నిహిత పరిచయాలు ఉన్నట్లు ఆయన ప్రసంగంను బట్టి తెలిసింది. రాయలసీమ కరువు, ఇతర సమయాలలో ఉమ్మడిగా ఏ విధంగా పనిచేశామో ఆయన వివరించారు.
బంగారు లక్ష్మణ్ రెండో ప్రపంచ యుద్ధం గురించి రెండు నెలలు పైగా వివరించారు. ఆయన ప్రసంగం వింటూంటే మనం యుద్ధభూమిలో ఉండి చూస్తున్నామా? అనిపించింది. అంత హృద్యంగా నాటి ఘటనలు వివరించారు. ఆ తర్వాత సైద్ధాంతిక అంశాలపై చెప్పుకొందాము అనుకోని మొదటగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానం గురించి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రయోగ సుబ్రహ్మణ్యం సుమారు రెండు వారాల పాటు చెప్పారు. ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. ఎటువంటి వివాదాలు తలెత్తలేదు.
కానీ, ఆ తర్వాత ఎం టి ఖాన్ కమ్యూనిజం గురించి ప్రసంగం ప్రారంభించగానే అభ్యంతరాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. రెండు రోజులకు మించి ఆయన ప్రసంగించలేక వాయారు. దానితో అర్ధాంతరంగా ప్రసంగం ముగించాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే అభ్యంతరాలు ఆర్ఎస్ఎస్, సోషలిస్టుల నుండి వ్యక్తం కాలేదు. జీవితం అంతా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అంకితమైన వారే ఆయన ప్రస్తావించిన చారిత్రక పరిణామాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. తప్పుదారి పట్టిస్తున్నావనో, అసత్యాలు చెబుతున్నవనో ఆయనకు పదే పదే అడ్డుతగలడం ప్రారంభించారు. దానితో ఆయనకు సహితం విసుగు కలిగింది.
ఒక పర్యాయం మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించాము. బంగారు లక్ష్మణ్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. జైలులో నేను `తరుణ్ కిరణ్’ పేరుతో ఒక లిఖిత పత్రికను ప్రతి పది రోజులకు ఒకటి తీసుకు వచ్చేవాడిని. సుభాష్ రెడ్డి దానికి బొమ్మలు వేస్తూ వచ్చేవారు. జైలులో ఉన్న వారితో ఇంటర్వ్యూలు, కవితలు, వ్యాసాలు ఇస్తూండేవాళ్ళం. మరోవంక, వాసిరెడ్డి వినోద్ కుమార్ `మసి’ పేరుతో మరో లిఖిత పత్రిక నడిపారు.
సాయంత్రం సమయాల్లో చెరబండరాజు, మరికొందరు చేరి విప్లవ గీతాలు పాడుకుంటూ ఉంటె, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వారు ఓ బృందగా భజన జరుపుకొంటూ ఉండేవాళ్ళం. బండారు దత్తాత్రేయతో పవార్, నేను, మరొకరు కలిసి నలుగురం నిత్యం ఆంగ్లంలో ఉన్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రంథం ఏకాత్మతా మానవతావాదం చదువుకుంటూ ఉంటే, దత్తాత్రేయ వివరించడం కొన్ని రోజులు జరిగింది. ఒక సారి వకృత్వ పోటీలు జరపగా, మరోసారి కవి సమ్మేళనం జరిగింది. ఇక మరోవంక, ఆటలు ఉంటూ ఉండెడివి.
జెపి ఉద్యమం పర్యవసానంగా ఎమర్జెన్సీ విధించారని అందరికి తెలిసిందే. ఈ ఉద్యమంలో సిపిఎం మినహా వామపక్షాలు, ముఖ్యంగా విరసం, ఎంఎల్ గ్రూప్ లకు ఎటువంటి సంబంధం లేదు. ఎమర్జెన్సీ సమయంలో సహితం వీరెవ్వరూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపిన దాఖలాలు లేవు. జైలులో ఉన్నప్పుడు `మాకు సంబంధం లేకపోయినా మీ కారణంగా మమ్ములను అనవసరంగా జైలుకు తీసుకు వచ్చారు’ అంటూ నిష్టూరంగా అంటూ ఉండేవారు.
హైకోర్టు సీనియర్ న్యాయవాది, మహానగర్ ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ సుబ్బారాయుడుతో పాటు మరికొందరు న్యాయవాదులు ఉండేవారు. కోర్టులు సహితం విడిచిపెట్టే అవకాశం లేదని తెలిసినా హైకోర్టులో అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తే హైకోర్టుకు వెళ్ళవచ్చు, పైగా, హైకోర్టు బుల్లెటిన్ లో మన పేర్లు చూసుకోవచ్చని చాలామంది వేసాము. సుబ్బారాయుడు గారు చెబుతుంటే నేనే టైపు చేస్తూ ఉండేవాడిని. దానితో ఒక సంవత్సరం పాటు సరిపోతుందని తెచ్చిన ఆ జైలు స్టేషనరీని నెలరోజుల్లోనే వాడేసాము.
ఆశ్చర్యకరంగా ఒక చిన్న సాంకేతిక అంశాన్ని ఆసరాగా తీసుకొని న్యాయమూర్తి సుమారు 25 మందిని అక్టోబర్, 1975లో విడుదల చేశారు. వెంటనే అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వడానికి నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాద్ లో ఆ రోజు లేకపోవడంతో రెండు రోజులు పట్టింది. రెండు రోజుల తర్వాత తిరిగి అందరిని అరెస్ట్ చేశారు. అయితే, నేను మాత్రం ఓ పది నెలల పాటు పోలీసులకు దొరకకుండా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో రాష్ట్రంలో పలు జిల్లాలో తిరుగుతూ గడిపాను. తిరిగి రెండోసారి కూడా విజయవాడలోనే అరెస్ట్ అయి మళ్ళి జైలుకు వచ్చాను. మమ్ములను విడుదల చేసిన జడ్జిని వెంటనే గుజరాత్ కు బదిలీ చేశారని ఆ తర్వాత తెలిసింది.
హైకోర్టులో పిటిషన్ వేసిన నలుగురు విద్యార్థులం మా చదువు పాడవుతుంది, విడుదల చేయమని ప్రత్యేకంగా జడ్జికి ఈ సందర్భంగా విన్నవించుకున్నాము. ఆయన సహితం సానుభూతితో ప్రభుత్వం పరిశీలించాలని అడ్వకేట్ జనరల్ కు సూచించారు. అయితే, `నిజంగా వీరికి చదువు పట్ల అంతగా శ్రద్ద ఉంటె ఇక్కడిదాకా వచ్చేవారు కాదు’ అంటూ అడ్వకేట్ జనరల్ ఎద్దేవా చేశారు.
(ఆంధ్రజ్యోతి వ్యాసాలకు సమాధానంగా పంపితే పాక్షికంగా ప్రచురించారు. ఇక్కడ పూర్తి వ్యాసం ఇస్తున్నాము)
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్