ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు…ప్రజలు మరచిపోతున్న కాంగ్రెస్!

ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు…ప్రజలు మరచిపోతున్న కాంగ్రెస్!
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
ఉపాధ్యక్షుడు, ఏపీ బీజేపీ
 
“ఎమర్జెన్సీ పేరుతో ఇందిరా గాంధీ జైళ్లలో ఖైదీల సంఖ్య, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు పాలైన వారి సంఖ్య కంటే చాలా ఎక్కువ “  ది ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ పుస్తకంలో రచయిత కూమి కపూర్ రాసిన వాక్యం ఇది.   ఈ ఒక్క  మాటే  భారతీయుల స్వాతంత్ర్య పోరాటాన్ని. త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజులో ఎలా హత్య చేయడానికి ప్రయత్నించిందో అర్థమైపోతుంది.
 
దశాబ్దాల పోరాటంతో బ్రిటిష్‌ వాళ్ల నుంచి భారతీయులు స్వాతంత్ర్యం పొందగలిగారు. దాన్ని తామే తెచ్చామని ప్రచారం చేసుకున్న నకిలీ గాంధీ చివరికి ఆ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడానికి ప్రయత్నించారు. అదే ఎమర్జెన్సీ.  జూన్  25, 1975న  ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అంటే రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య హక్కులన్నింటికీ పాతరేశారు. 
 
ప్రభుత్వం లేదు. వ్యవస్థలు లేవు. ఉన్నదల్లా ఒకటే.. ఇందిరాగాంధీ నియంతృత్వం.  ప్రశ్నిస్తారని అనుకున్న ప్రతి ఒక్కరినీ జైల్లో పెట్టారు. నిజాలు చెబుతాయనుకున్న పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. ప్రజాస్వామ్యం కోసం నినదించిన ప్రతి ఒక్కరినీ శిక్షించారు.  అంటే మళ్లీ స్వాతంత్ర్యం పోయిందన్నమాట.   21 నెలల పాటు అంటే   జూన్  25, 1975 నుంచి మార్చి 21,  1977 వరకు  మన దేశం మరోసారి స్వాతంత్రం కోల్పోయింది.  నకిలీ గాంధీల చేతిలో నియంతృత్వం నడుమ బిక్కుబిక్కుమంటూ గడిపింది.  
ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ చేసిన ఈ హత్యాయత్నానికి యాభై సంవత్సరాలు నిండాయి.  కాంగ్రెస్ అప్పటికి, ఇప్పటికి ఏమైనా మారిందా?. ప్రజలను గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని పాటించాలని అనుకుంటోందా?.  భారత స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని అనుకుంటోందా?అంటే..  “ ప్చ్ “  అనే సమాధానమే  ఎవరికైనా వస్తుంది.  స్వాతంత్ర్య పోరాటంపై  కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చరిత్రలో తప్పుడు సమాచారమే భవిష్యత్‌కు అందేలా చేసింది.  
నిజంగా స్వాతంత్ర్య పోరాటం చేసిన వారి గురించి  ప్రచారం లేకపోవడం, అసలు తెలియకుండా చేయడం చేశారు. జల్సా రాయుళ్లుగా గుర్తింపు పొందిన వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా చరిత్రలోకి ఎక్కించారు.  దేశ ప్రజలందరూ ప్రాణాలకు పణంగా పెట్టి చేసిన పోరాటం ఫలితంగా వచ్చిన పోరాటాన్ని  తమ సొంతం చేసుకున్నారు నకిలీ గాంధీ. 
జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె ఇందిర   ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుని ఇందిరా గాంధీ అయ్యారు.
కానీ మహాత్మాగాంధీ వారసులు అన్నట్లుగా దేశ ప్రజల్లోకి ఓ రకమైన ప్రచారం చేసుకున్నారు.  దేశాన్ని గుప్పిట పట్టి పాలించడం ప్రారంభించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ తమ కాలి కిందనే ఉండాలని, తాము చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం అన్నట్లుగా చెలరేగిపోయారు.  కానీ  బాబా సాహెబ్  రచించిన రాజ్యాంగం  అంత కంటే శక్తివంతమైనది. వ్యవస్థలకు ధీరులు నేతృత్వం వహించినప్పుడు రాజ్యాంగం పవర్ అందరికీ తెలుస్తుంది. ఇందిరాగాంధీకి అలా తెలియడంతోనే ప్రజాస్వామ్యపై హత్యాయత్నం చేశారు.
 
1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి నియోజకవర్గం నుండి ఇందిరా గాంధీ గెలిచారు.  ప్రజాస్వామ్యం అంటే చిన్నచూపు ఉన్న ఇందిరా గాంధీ ఆ ఎన్నికల్లో చేయని అక్రమాలు లేవు. ఈ అక్రమాలను   సోషలిస్టు నాయకుడు  రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసి నిరూపించారు.   
 
1975 జూన్ 12న  అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ జగమోహన్ లాల్ సిన్హా ఇందిరా గాంధీ ఎన్నికలలో అవకతవకలకు పాల్పడినట్లు తీర్పు ఇచ్చారు. ఆమె ఎన్నికను రద్దు చేస్తూ, ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించారు.  సుప్రీం కోర్టులో అప్పీల్ చేసినప్పటికీ, జూన్ 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తి  జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్  షరతులతో కూడిన స్టే ఆర్డర్ ఇచ్చారు,
 
దీనితో ఇందిరా ప్రధానమంత్రిగా కొనసాగినప్పటికీ రాజకీయ భవిష్యత్ పెను ప్రమాదంలో పడింది. అప్పటికే దేశం కాంగ్రెస్ పార్టీ పాలనా విధానాలతో అతలాకుతలం అవుతోంది.  ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార కొరత వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితులు ప్రజలలో, ముఖ్యంగా యువతలో, ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచాయి.  
 
జయప్రకాశ్ నారాయణ్  నేతృత్వంలో బీహార్‌లో ప్రారంభమై సంపూర్ణ క్రాంతి విప్లోద్యమం,  కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలను ఏకం చేసింది.  ఇందిరా గాంధీ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం అయ్యాయి.  పోలీసులు, ఆర్మీ,  ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించవద్దని విపక్ష నేతలు పిలుపునిచ్చారు.  ఇక దేశం నుంచి ప్రజలు కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని తెలియడంతో ఇందిరాగాందీ ప్రజలకు వెన్నుపోటు పొడవాలని నిర్ణయించుకున్నారు.  
ఎమర్జెన్సీ ప్రకటించారు.   మీడియా సెన్సార్‌షిప్,  విపక్ష నాయకుల అరెస్టులు, పౌర హక్కుల అణచివేత,  బలవంతపు కుటుంబ నియంత్రణకో  ఎమర్జెన్సీని నియంతృత్వంగా  మార్చారు. అంటే  కాంగ్రెస్ పార్టీ భారత దేశ ప్రజల స్వేచ్చను, స్వాతంత్ర్యాన్ని  లాగేసుకుందన్నమాట.  ప్రజా ఉద్యమంతో మరో స్వాతంత్ర్య పోరాటం చేస్తారన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నేతలందర్నీ జైళ్లలో పెట్టించారు ఇందిరాగాందీ. అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ సహా దిగ్గజం నేతలందర్నీ కటకటాల పాలు చేశారు.  
మెయిన్‌టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మిసా) , డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ (డిఐఆర్) చట్టాల కింద  వేల మందిని అరెస్టు చేశారు.  ఎమర్జెన్సీని వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకుల్ని కూడా వదల్లేదు.   ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న ఎస్.జైపాల్ రెడ్డిని,   తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎం. కరుణాకరన్ ను మీసా చట్టం కింద అరెస్టు చేశారు.  పీవీ చలపపతిరావు, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ,  సహా  ఎం.కె. స్టాలిన్ ,  హెచ్.డి. దేవేగౌడ  జె.హెచ్. పటేల్ ,  ఓ. రాజగోపాల్,    వి.ఎస్. అచ్యుతానందన్ ఇలా ప్రముఖులందర్నీ  జైలుకు పంపారు.  
 
ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆర్ఎస్ఎస్, జనసంఘ్, సోషలిస్ట్ ఉద్యమాలతో సంబంధం ఉన్న నాయకులందర్నీ అరెస్ట్ చేశారు.  అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఎమర్జెన్సీ సమయంలో మొత్తం 1,40,000 మందిని నిర్బంధించారు.  బ్రిటిష్ వాళ్లు కూడా ఇంత మందిని జైల్లో పెట్టలేదు.  ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు అప్పటి నుంచి  శిక్షించడం ప్రారంభించారు.
 
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రత్యామ్నాయం లేదనుకున్న పరిస్థితి నుంచి జనసంఘ్, జనతా పార్టీ .. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రూపంలో బలమైన ప్రత్యామ్నాయం రూపొందింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయిందంటే ప్రజలు ఆ పార్టీ ఉనికి ఏ మాత్రం భరించేందుకు ఆసక్తిగా లేరని అర్థం చేసుకోవచ్చు.  మార్చి 21,  1977న తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన ఇందిరా గాంధీకి ప్రజలు ప్రజాస్వామ్య పవర్ చూపించారు.
ఎమర్జెన్సీ రద్దయిన తర్వాత 1977లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ జనతా పార్టీ చేతిలో ఘోర ఓటమి చెందింది. కాంగ్రెస్ కేవలం 153 సీట్లు గెలుచుకోగా, జనతా పార్టీ 295 సీట్లతో అధికారంలోకి వచ్చింది.  ఇందిరా గాంధీ స్వయంగా రాయ్‌బరేలిలో రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ , బీహార్‌లో, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు.  ఈ ఎన్నికలు “కాంగ్రెస్ లేని భారతదేశం” సాధ్యమనే నమ్మకాన్ని ప్రజలలో కలిగించింది.  
ఆ తర్వాత విపక్ష పార్టీలను బలహీనం చేయడం ద్వారా కాంగ్రెస్ కొన్ని సార్లు అధికారంలోకి రాగలిగింది.  కానీ రాను రాను కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది.  ఇందిర మరణం, రాజీవ్ గాంధీ మరణం సానుభూతితో  గెలిచినా వారు మారలేదు.  అందుకే ప్రజలు ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఎంతలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతంగా వంద సీట్లు గెలుచుకుంటే అదో అద్భుతం అన్నట్లుగా దిగజారిపోయింది.  
 
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం లేదా ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలు   హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్,   మధ్యప్రదేశ్,  ఛత్తీస్‌గఢ్ , తెలంగాణ , కర్ణాటక, మహిచల్ ప్రదేశ్  మాత్రమే. మిత్రపక్షాలతో కలిసి  తమిళనాడు,  కశ్మీర్ వంటి చోట్ల అధికారంలో ఉన్నా.. వారి పాత్ర చాలా పరిమితం.  అత్యధిక సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్,  ఒడిషా,  కేరళ, మహారాష్ట్ర,  పంజాబ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. 
 
2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ  కేవలం 328 స్థానాల్లో  పోటీ చేయగలిగింది. అందులో గెలిచింది 99 సీట్లు. ఇదే అద్భుతమైన ప్రదర్శన.  229 స్థానాల్లో పరాజయం పాలైంది.  వీటిలో 120కిపైగా నియోజకవర్గాల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అంటే ప్రధానంగా పోటీ పడిన నియోజకవర్గాలు 250 కూడా లేవు.   భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 272 స్థానాలు సాధించాలి.  కాంగ్రెస్ పార్టీ కనీసం అన్ని స్థానాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే రాను రాను నిర్వీర్యం అయిపోతోంది.  
ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉనికి లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో మిణుకుమిణుకుమంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించడంలేదు.   ఎందుకంటే ఆ పార్టీ తన ప్రజాస్వామ్య వ్యతిరేక, ఎమర్జెన్సీ తరహా మైండ్ సెట్‌తోనే నడుస్తోంది.  మైనార్టీల్ని, దళితుల్ని ఓటు బ్యాంకులుగానే చూస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించడానికి అవసరమైన సీట్లు రానప్పుడు రాహుల్ లేదా సోనియా గాంధీ బాద్యతలు స్వీకరించరు. అదే ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అన్ని స్థానాలు వచ్చినప్పుడు ఆ స్థానాన్ని రాహుల్ గాంధీ తీసుకున్నారు. 
 
అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా మైనార్టీ, దళితుల్ని  రాజకీయాల కోసం ఉపయోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.  అత్యవసర పరిస్థితికి దారితీసిన అదే మనస్తత్వం నేటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. అది జవాబుదారీతనం లేకుండా అధికారాన్ని కోరుతూనే ఉంది. ఒకే కుటుంబానికి మాత్రమే నాయకత్వం వహించే హక్కు ఉందని అది ఇప్పటికీ నమ్ముతుంది.

వంశపారంపర్య విధేయతకు అనుకూలంగా సమర్థులైన నాయకులను పక్కన పెట్టింది. జ్యోతిరాదిత్య సింధియా దీనికి ఒక ఉదాహరణ. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశాజనకమైన యువ నాయకుడు, పార్టీకి విశ్వాసపాత్రుడైన సభ్యుడు అయినప్పటికీ, ఆయనను కీలక నిర్ణయాలు తీసుకోకుండా దూరంగా ఉంచారు. ప్రధాన బాధ్యతలను తిరస్కరించారు. చివరికి, భ్రమపడి, ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బిజెపిలో చేరారు. అక్కడ ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ సంఘటన కాంగ్రెస్ యొక్క అర్హత కంటే కుటుంబం పట్ల నిరంతర ప్రాధాన్యతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

ఎమర్జెన్సీ సమయం నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీని మర్చిపోవడం ప్రారంభించారు.  ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్ని గౌరవించి తాము చేసిన తప్పుల్ని దిద్దుకుంటే ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల్ని గౌరవించే పనులు చేయలేదు. రెండు సార్లు సానుభూతితో  గెలిచి.. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం  చేయడం, రాజ్యంగా వ్యవస్థలను దుర్వినియోగం చేసి రాజకీయ పార్టీలను హత్య చేసే ప్రయత్నాలను చేసింది. అందుకే ఎప్పటికప్పుడు ఆ పార్టీ చీలిక పేలికలవుతూ వచ్చింది.  

 
అదే సమయంలో ప్రజల బతుకుల్ని మార్చడానికి అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయలేదు. ఎప్పటికప్పుడు దేశ ప్రజల మధ్య విభజన తెచ్చి.. తమ ఓటు బ్యాంకుగా ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించింది తప్ప.. అందర్నీ సమానంగా ఎదిగేలా చేద్దామని చూడలేదు. కులాలు, మతాల పేరుతో రాజకీయం చేసి ప్రపంచంతో పోటీ పడకుండా దేశాన్ని వెనుకబడిపోయేలా చేశారు. నేటి తరం ప్రజలకు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతాలు అర్థమవుతున్నాయి. 
 
గత పదకొండేళ్లలో జరిగిన అభివృద్ధి, ఆలోచనలు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అమలు చేసి ఉన్నట్లయితే భారత్ ఇప్పటికే సూపర్ పవర్ గా మారి ఉండేదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన క్షుద్ర రాజకీయాలు,ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల కారణంగానే దేశానికి ఈ గతి పట్టింది. అధికారం కోసం ఆ పార్టీ ప్రజల హక్కుల్ని, స్వేచ్చను.. ప్రజాస్వామ్యాన్ని వధించేందుకు కూడా సిద్ధపడుతుందని ఎమర్జెన్సీ తెలియచేస్తుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తక్కువ అంచనా వేస్తుంది.  ప్రజాస్వామ్యాన్ని తమ పార్టీ హత్య చేయడానికి ప్రయత్నించి 50 ఏళ్లు దాటిపోయిందని అందరూ మర్చిపోతారని అనుకుంటోంది.  కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన నష్టాన్ని మర్చిపోరు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధపడరు. ఇప్పటికైనా దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టానికి క్షమాపణలు చెప్పుకుని నకిలీ గాంధీలు కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజకీయాల నుంచి వైదొలిగాలి. అప్పుడే భారత ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.