ఎమర్జెన్సీ చివర్లో పివి చలపతిరావు అరెస్ట్ కలకలం

ఎమర్జెన్సీ చివర్లో పివి చలపతిరావు అరెస్ట్ కలకలం
విష్ణుభట్ల రామచంద్ర                                                                                                *చలపతిరావు 91వ జయంతి సందర్భంగా నివాళి
ఎమర్జెన్సీ సమయంలో నాటి జనసంఘ్ ఎమ్యెల్సీ పివి  చలపతిరావు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, పోలీసులు ఎంతగా ప్రయత్నించినా దొరకకుండా పలు జిల్లాల్లో పర్యటనలు జరుపుతూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించారు. 18 నెలలు కుటుంబానికి దూరంగా, కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూ రాష్ట్రం  అంతా పర్యటన చేస్తూ కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ వున్నారు. 
 
ఒకసారి శాసన మండలి సమావేశం హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో రహస్యంగా ఒక మంత్రి  కారులో హైదరాబాద్ లో శాసన మండలికి చేరుకుని, హాజరు పట్టిపై సంతకం చేసి, చాకచక్యంగా పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నారు.  అప్పట్లో రాజ్యసభలో సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఈవిధంగా చేశారు. వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ప్రభుత్వంకు ఇవ్వకుండా చేశారు. 
 
ఆ సాహసాన్ని జీర్ణించుకోలేని ఆ పోలీసు అధికారులు చలపతిరావును అరెస్టు చేసే అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఆయన  ఆచూకీ తెలిపితే రూ .10,000 పారితోషికం కూడా ప్రకటించారు.  ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. దేశవ్యాప్తంగా సంఘ స్వయంసేవకుల సత్యాగ్రహం వల్ల ఇందిరా గాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో 1977 లో ఎన్నికలు ప్రకటించారు. 
 
18 నెలలుగా జైళ్లలో మగ్గుతున్న వేలాది  మంది నాయకులను జైలు నుంచి విడుదల చేశారు. 1977 ఎన్నికలకు సిద్ధం అవుతున్న సమయంలో అనకాపల్లి నుండి లోక్ సభకు జనతాపార్టీ అభ్యర్థిగా ఆయనను అభ్యర్థిగా నిర్ణయించారు. అయితే, అరెస్ట్ వారంట్ పెండింగ్ లో ఉండడంతో అరెస్ట్ చేయక తప్పదని పోలీసులు వాదిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం ప్రారంభ సూచకంగా  పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 
 
తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, యలమంచిలి శివాజీ వంటి అనేక మంది ప్రముఖు నాయకులు ఆ సభలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.          ఆ ముందు రోజు చలపతిరావు కాకినాడ వచ్చిన సందర్భంగా నేను వారిని అక్కడే సాయంత్రం కలిశాను. ఆ సమయంలో కాకినాడ లో నేను ప్రచారక్ గా ఉన్నాను.  “రామూ ఇవాళ మనం కలిసి ఊరు వెళ్ళాలి,  వస్తావా?” అని అడిగారు.   విషయం అర్ధం అయ్యింది. 
 
అనకాపల్లి సభలో ఆయన పాల్గొనాలి. కానీ ప్రభుత్వం, పోలీసులు ఆయనను  అరెస్ట్ చేసితీరతామని, సభలో పాల్గొనివ్వమని కరాఖండిగా చెప్పారు. ఆ విషయం ముందుగా అందరికీ తెలిపారు. కానీ చలపతిరావు దానినిసవాలుగా తీసుకొని అరెస్ట్ కాకుండా సభలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. నేను, చలపతిరావు కలిసి ఆ  రాత్రే అనకాపల్లి చేరుకోవాలి. తర్వాత రోజు సాయంత్రం అనకాపల్లిలో జరగనున్న చాలా పెద్ద బహిరంగ సభలో పాల్గొనాలి. 
 
ఎవరికీ తెలియ కుండా చేరుకోవాలి.  ఎక్కడకు ఎప్పుడు చేరిపోవాలో నిర్ణయం అయ్యింది. మా ప్రయాణం ప్రారంభం అయ్యింది. గళ్ళ లుంగీ. లాల్చీ. పైన శాలువా, ముఖం కప్పుతూ మఫ్లర్, ఆయనను గుర్తు పట్టడం కష్టం. రాత్రి 11 గం. పిఠాపురం స్టేషన్ చేరుకున్నాం. ఏదో రైలు వచ్చింది. ఎక్కి తుని స్టేషన్లో దిగి, బయట హైవే మీద ఒక లారీ ఆపి ఎక్కాం.  తెల్లవారుజామున 2౼ 3గం మధ్యలో అనకాపల్లిలో దిగి నడచుకుంటూ బయలుదేరాము. 
 
పోలీసు క్వార్టర్ల మధ్యలోంచి ధైర్యంగా ముందుకు వెళ్లి పోలీసులు లేరని నిర్ధారించుకుని చలపతిరావు గారి ఇంటికి  చేరిపోయాం. తలుపు తీసిన రాధమ్మ  నిశ్చేష్టులై పోయారు. సంఘ యోజన ప్రకారం ఆయన ట్రైన్ లో రావాలి. వేరే చోట ఉండాలి. కానీ ట్రైన్లో వస్తే పోలీసులు పెట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.  ఇంటికి చేరుకున్న మేము విశ్రాంతి తీనుకున్నాము. ఆ రాత్రి గడిచిపోయింది. 
 
ఆ  ఇంట్లో 2 ఏళ్ల వయస్సులో అభం శుభం తెలీని బాబు (ప్రస్తుతం మాజీ ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్), 5, 7 సంవత్సరాల అక్కా చెల్లెళ్ళు అంజనా ఉపాధ్యాయ్, (దీన్దయాల్ ఉపాధ్యాయ్ పేరు) అపర్ణ ముఖర్జీ( శ్యాంప్రసాద్ ముఖేర్జీ పేరు),  తండ్రిని ఎంతో కాలం తర్వాత చూసిన ఆనందం తో పొంగిపోతున్నారు. ఆ సమయంలో ఇంటిని, పిల్లలతో  రాధమ్మ ఎలాగ నడిపిస్తున్నారో అర్ధం కాలేదు. 
 
రాధమ్మ కూడా విశాఖ వెళ్లి సత్యాగ్రహాలు చేసిన చరిత్ర వేరే వుంది. భర్తకు తగిన భార్య. వేడిగా టిఫిన్ సిద్ధం చేశారు. టిఫిన్ చేసి నేను కొత్త కనుక బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి బయల్దేరాను. బయట పోలీస్ బందోబస్తు గట్టిగా వుంది. నేను మళ్ళీ రాను అని చెప్పి బయలుదేరాను. ఎందుకంటే నా వెనకాల పోలీసులు ఇంట్లోకి వస్తే కష్టం.  నేను విశాఖలో అరెస్ట్ తప్పించుకోవడం కోసం  అనకాపల్లిలో కూడా 2 నెలలు పనిచేసాను. వూరు అంత పరిచయమే. సాయంత్రం అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్ లో బహిరంగసభ జరుగుతుందనే ప్రచారం ముమ్మరంగా వుంది.
ఎమర్జెన్సీ తర్వాత మొదటి బహిరంగ సభ. వేల సంఖ్యలో గ్రామాల నుంచి జనం వస్తున్నారు. సాయంత్రం సభా ప్రాంగణం జనంతో నిండిపోయింది. స్టేజీమీద నాయకులు ఉద్వేగంతో మాట్లాడుతున్నారు. చీకటి పడింది. అదే సమయంలో విశాఖకు చెందిన వెంపరాల రామకృష్ణ రావు చలపతిరావును ఇంటి దగ్గరకు వెళ్ళమని వారికి సూచన అందడంతో స్కూటర్ తీసుకొని బయల్దేరారు. ఇంటి దగ్గర వున్న పోలీసులు సభ ప్రారంభం అయింది అనే భావనతో సభ దగ్గరకు వెళ్లిపోయారు. 
 
ఈ పధకం రచించిన నాటి విభాగ ప్రచారక్  సంగమేశ్వర శాస్త్రి. ఆయన  సూచించిన పద్ధతిలో వెంపరాల వారితో  బయల్దేరారు. చలపతిరావు నిండుగా శాలువా, మఫ్లర్ తలా నుండా కప్పుకుని వెంపరాల వారి ద్విచక్ర వాహనం ఎక్కి, పధకం ప్రకారం నిర్దేశించిన మార్గంలో బయల్దేరారు. నేను సభలో వేదిక దగ్గర్లో నిలుచున్నాను.  పోలీసులు వేదిక చుట్టూ వలయాకారంగా  ఏర్పడి ఎవ్వరూ వేదిక పైకి రాకుండా చేతులు గొలుసుగా  పట్టుకుని నిల్చున్నారు. 
 
ఉపన్యాసాలు వేడి వేడిగా సాగుతున్నాయి. ఇంతలో సభ గేట్ దగ్గర కలకలం. చలపతిరావు జిందాబాద్ అంటూ నినాదాలు. ప్రజలందరూ అటువైపు చూస్తున్నారు. కొంతమంది పరిగెడుతున్నారు. పధకం ప్రకారం వేదిక మీద నుంచి కూడా ఒక నాయకుడు గేట్ వైపు చూపిస్తూ చలపతిరావు గారికి స్వాగతం అని అరుస్తున్నారు. అప్పటి వరకు చుట్టూ గోడ దగ్గర కాపలా వున్నా పోలీసులు గేట్ వైపు పరిగెత్తారు. 
 
గోడ అవతలవైపు ఈ సమయం కోసం వేచి చూస్తున్న చలపతిరావు వెనక గోడ మీద దాటి లోపలి వచ్చారు. చుట్టూ వున్నా స్వయంసేవకులు వారిని ముట్టడించి బయటకి కనపడకుండా స్టేజి దగ్గరగా నడిచి వచ్చేశారు.  స్టేజ్ చుట్టూ వున్న పోలీసుల దృష్టి ఈ సమూహం మీద పడింది. అదే సమయంలో మళ్లీ  గేట్ దగ్గర చలపతిరావు జందాబాద్ నినాదాలు. పోలీసులకి ఏమి జరుగుతోందో పాలుపోవడం లేదు.
 
అజజాను బాహుడైన చలపతిరావును ఒక పోలీసు కానిస్టేబుల్ దూరం నుంచే గుర్తు పట్టాడు. తన తోటి వాళ్ళని అప్రమత్తం చేసాడు. స్వయంసేవకుల మధ్యలోంచి వేదిక వైపుకు బయల్దేరిన వారిని వేగంగా పోలీసులు ముట్టడించారు. పోలీసుల కబంధ హస్తాలలో చలపతిరావు నలిగిపోతున్నారు.  స్టేజి మీద వున్న గౌతు లచ్చన్న, కొమరగిరి రామ్మోహనరావు, తెన్నేటి విశ్వనాథం, యలమంచిలి శివాజీ మొదలైన నాయకులంతా లేచి సభ మధ్యలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరకూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అందరూ ముందుకు తోసుకు వస్తున్నారు.
నేను, స్వయంసేవకులందరం పోలీసులని చుట్టూ ముట్టి వేదిక వైపుకు నెట్టడం మొదలు పెట్టాము.  ఇంతలో వేదిక మీద వున్న తెన్నేటి విశ్వనాథం పోలీసులను హెచ్చరించారు. ప్రజలందరి మధ్యలో సాగుతున్న ఈ అన్యాయమైన అరెస్ట్ ప్రక్రియ ఆపక పోతే ప్రజలందరూ పోలీసులని కదలకుండా చేస్తామని గట్టిగా చెప్పారు. ఇంతలోగా చలపతిరావు గారిని ఆపాదమస్తమ్ గట్టిగ పట్టుకున్న పోలీసుల వల్ల వారి బట్టలు పీలికలైపోయాయి. ఊపిరి అందక ఆయన సతమతం అయిపోతున్నారు. 
 
సభ ప్రాంగణం అంతా చలపతిరావ్ జిందాబాద్, నిరంకుశత్వం నశించాలి అనే నినాదాలతో మారు మ్రోగి పోయిపోయింది. ప్రజా ఆగ్రహం ముందు ప్రభుత్వం తల వంచింది. పోలీసుల మధ్యలోంచి విడదీసి చలపతిరావును వేదిక మీదకి తీసుకు వెళ్ళాము. చిరిగి పోయిన లాల్చీ, విడిపోతున్న పైజామా విరిగిన కళ్ళజోడు తో వేదికనెక్కుతుంటే ప్రజలందరూ ఒక పక్కన బాధ, మరొక పక్క  ఉత్సాహంతో నాట్యాలు చేసేస్తున్నారు. 
 
నినాదాలు మరు మ్రోగి పోతున్నాయి. వేదికమీద అందరు స్వాగతం పలుకుతూ ఉంటే నిలబడిన చలపతిరావు ఒక్క సారిగా  స్పృహ కోల్పోయారు. నిలువునా విగ్రహం కిందకు జారి పోతుంటే అందరూ పట్టుకుని మంచినీళ్లు ఇచ్చి సేద తీరుస్తున్న సందర్భంలో నాయకులు అందరూ వారిని అల్లూరి సీతారామరాజుతో పోలుస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ సభని కొనసాగించారు. 
 
తేరుకున్న కొదమ సింహం ఉద్వేగమైన ఉపన్యాసం ఇచ్చారు. చివరలో పోలీసులు పంతం కొద్దీ అరెస్ట్ చేసి పెద్ద బందోబస్తుతో  జైలుకు తరలించారు. 18 నెలల ఎమర్జెన్సీ అంతా అజ్ఞాతంలో  గడిపి, అనేక సమయాల్లో అరెస్ట్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆయనను సభలో పాల్గొకుండా ఆపాలని కుతంత్రం చేసినా, పోలీసుల కన్నుగప్పి, సొంత ఇంట్లోనే దాక్కొని పోలీసుల వలయాన్ని ఛేదిస్తూ వేదిక ఎక్కి తన సత్తా చాటుకున్నారు. 45 సంవత్సరాల తర్వాత కూడా చలపతిరావు గారిలో అదే ఉత్సాహం. కలిసినప్పుడు ఎంతో ప్రేమగా పలకరించే ఆ వ్యక్తిత్వానికి జోహార్లు