
* జూన్ 25న తొలిసారిగా ‘రాజ్యాంగ హత్యా దివస్’
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏటా ‘రాజ్యాంగ హత్యా దినం’ జరుపుతామని 2024 జులై 12న ప్రకటించింది. దీంతో తొలిసారిగా బుధవారం అధికారికంగా ‘రాజ్యాంగ హత్యా దినం’ జరగబోతోంది. అయితే ఎన్‌డీఏ సర్కారు వాదనతో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది. ఎమర్జెన్సీ వల్ల రాజ్యాంగ హత్య జరిగిందనే వాదనలో వాస్తవం లేదని అంటోంది.
ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఈ వాదోపవాదనల నేపథ్యంలో ఎమర్జెన్సీ కీలక ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే తేదీన అర్ధరాత్రి వేళ యావత్ దేశాన్ని కుదిపేసే నిర్ణయం ఒకటి వెలువడింది. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రకటించారు.
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సిఫారసు మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో 1975 జూన్ 25న అకస్మాత్తుగా మన దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. 1977 మార్చి 21 వరకు అది కొనసాగింది. ఇందిరాగాంధీ 1966 జనవరి 24న తొలిసారిగా భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1971 వరకు అంతా సాఫీగానే సాగింది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఇందిర పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్‌పై లక్షా 11 వేల 810 ఓట్ల తేడాతో ఆమె గెలిచారు.
ఇందిర ఎన్నికపై 7 అభియోగాలు
దీంతో ఈ ఎన్నికల ఫలితాన్ని అలహాబాద్ హైకోర్టులో రాజ్‌నారాయణ్ సవాల్ చేశారు. ఈ ఎన్నికలో ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరాగాంధీ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. అలహాబాద్ హైకోర్టులో రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇందిరకు వ్యతిరేకంగా మొత్తం ఏడు అభియోగాలు ఉన్నాయి.
ఇందిరాగాంధీ ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్‌పాల్ కపూర్‌ను నియమించుకున్నారు అనేది ఆయన మొదటి ఆరోపణ. ఎన్నికల ప్రచార సభల స్టేజీల నిర్మాణం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను ఉపయోగించారనేది ఇంకో అభియోగం. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు అనేది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన అని అలహాబాద్ హైకోర్టులో రాజ్‌నారాయణ్ వాదించారు.
ఓట్ల కోసం ఇందిర డబ్బులు పంచారని, బోగస్ ఓటింగ్ చేయించారనే ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఇందిర ఎన్నికను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీంతో 1971 మార్చి రెండో వారం నుంచి 1975 జూన్ నెల వరకు వాదనలు కొనసాగాయి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్‌లాల్ సిన్హా సంచలన తీర్పును వెలువరించారు.
రాజ్‌నారాయణ్ చేసిన 7 ఆరోపణల్లో 5 ఆరోపణల నుంచి ఇందిరాగాంధీకి ఆయన ఊరట కల్పించారు. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారనే ఆరోపణల్లో ఆమెను దోషిగా నిర్ధరించారు. ఈ నేపథ్యంలో ఇందిర లోక్‌సభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. మరో 6 సంవత్సరాల పాటు లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. ఒక ప్రధాన మంత్రికి సంబంధించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా, మొత్తం ప్రపంచంలోనే అదే తొలిసారి.
ఇందిరపై సుప్రీంకోర్టు ఆంక్షలు
అలహాబాద్ హైకోర్టు తీర్పుతో షాక్‌కు గురైన నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను 1975 జూన్ 22న దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 1975 జూన్ 24న కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఇంజంక్షన్ ఆర్డర్లు జారీ చేసింది.
ప్రధానిగా ఇందిరా గాంధీ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు, ప్రసంగాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే పార్లమెంట్‌లో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా న్యాయస్థానం ఆంక్షలు విధించింది. తాము తుది తీర్పును వెలువరించే వరకు ఈ ఆంక్షల అమలు కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ఆంక్షలను ఎదుర్కోవాల్సి రావడంతో ఇందిర ఆనాడు సుదీర్ఘ ఆలోచనలో పడ్డారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి స్వరణ్‌సింగ్‌ను తాత్కాలిక ప్రధానిగా చేయాలనే ఆలోచనను ఇందిర చేశారని అంటారు. ఈ ప్రతిపాదనను నాటి సీనియర్ కేంద్ర మంత్రి జగ్జీవన్రామ్ వ్యతిరేకించారని పలు పుస్తకాల్లో ప్రస్తావన ఉంది.
ప్రధాని పదవిని స్వరణ్ సింగ్‌కు ఇవ్వాలనే ఆలోచన చేస్తే, తానూ ఆ రేసులో ఉంటానని ఇందిరతో జగ్జీవన్రామ్ అన్నారని ఆ పుస్తకాల్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఇందిరా గాంధీపై నిప్పులు చెరగడం కొనసాగించాయి. 1975 జూన్ 25న మధ్యాహ్నం డిల్లీలోని రాంలీలా మైదానంలో ఇందిరకు వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది.
వెంటనే ‘ఎమర్జెన్సీ’ ప్రకటన
1975 జూన్ 25న ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ జరిగిన వెంటనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె హుటాహుటిన ఒక రహస్య లేఖను నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌కు పంపారు. “దేశానికి పెను ముప్పు పొంచి ఉంది. అంతర్గత భద్రతకూ ముప్పు కలిగే అవకాశం ఉంది. అందుకే ఎమర్జెన్సీని ప్రకటించే అంశాన్ని పరిశీలించండి” అని ఆ లేఖలో ఉంది.
దీంతో ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయం కావడానికి కొన్ని నిమిషాల ముందు నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. మరుసటి రోజు (1975 జూన్ 26న) దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియోలో ప్రధాని ఇందిరా గాంధీ ప్రసంగించారు. “సోదర, సోదరీమణులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించారు. భయాందోళన అవసరం లేదు” అని ఆమె వెల్లడించారు.
‘మిసా’తో భావ ప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం
1975 జూన్ 30న మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా)లో ఇందిర సర్కారు కీలక సవరణలు చేసింది. ‘ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలిపే వారిని, మాట్లాడే వారిని విచారణ లేకుండానే నిర్బంధించవచ్చు’ అనే వివాదాస్పద అంశాన్ని ఈ చట్టంలో చేర్చారు. ఇక ఇదే సమయంలో దేశ ప్రజలకు చేరువయ్యేందుకు 1975 జులై 1న 20 పాయింట్ల కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ ప్రకటించారు.
దీని ద్వారా దేశంలో ఆర్థిక, సామాజిక సంస్కరణలను సాధిస్తామని వెల్లడించారు. అదే రోజున (1975 జులై 1న) పౌర స్వేచ్ఛలను నిలిపివేస్తున్నట్లుగా సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. పెల్లుబుకుతున్న ప్రజా నిరసనలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 1975 ఆగస్టు 5 నుంచి నిరంకుశమైన మీసా చట్టం అమల్లోకి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఎమర్జెన్సీ కాలం ముగిసే వరకు దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు.
రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, విలేకరులు, మీడియా సంస్థల నిర్వాహకులను ఆనాడు ఇందిర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతువిప్పే వారిపై మిసాను ప్రయోగించారు. కాలక్రమంలో ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 దేశ ప్రజలకు ప్రసాదించిన 7 హక్కులను నిలిపివేస్తూ 1976 జనవరి 9న ఇందిర సర్కారు మరో ప్రకటన విడుదల చేసింది.
ఇందిరకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
1975 నవంబరు 7న సుప్రీంకోర్టు కీలక 1971 నాటి రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అవకతవకలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా తగిన ఆధారాలేవీ లభించలేదని తేల్చి చెప్పింది. ఆనాడు ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా చేసిన ఎన్నికల ఖర్చులను ప్రభుత్వపరమైనవిగా పరిగణించకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. రాయ్‌బరేలీ ఎన్నికలో అధికార దుర్వినియోగం వ్యవహారంలో ఇందిరాగాంధీ దోషి అంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది.
ఆమె ఎంపీగా అన్ని అధికారాలను పొందొచ్చని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 1976 నవంబరు 2న భారత పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. ప్రధానమంత్రి లాంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందే పదవుల్లో ఉండేవారికి సంబంధించిన వ్యవహారాలను సమీక్షించేందుకు కోర్టులకు ఉన్న అధికారాలను ఈ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది.
రాజకీయ ప్రముఖులు, విద్యార్థి నేతల అరెస్టులు
‘సంపూర్ణ విప్లవం’ నినాదంతో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పెద్దసంఖ్యలో ప్రజలను ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా కూడగట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జెపి, మొరార్జీ దేశాయ్, వాజపేయి, మధు దండావతే వంటి వందలాదిమందిని అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండేజ్ కొంతకాలం పాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ఎలాగోలా ఆయనను కూడా ఇందిర అరెస్టు చేయించారు.
విజయరాజే సిందియా, సిద్ధరామయ్య, కే స్టాలిన్ కూడా ఆనాడు అరెస్టయ్యారు. జనసంఘ్, లోక్ దళ్, కాంగ్రెస్ (ఓ), సోషలిస్టు నేతలు దేశవ్యాప్తంగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కార్మిక, విద్యార్థి, యువజన, రైతు సంఘాల నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. విద్యార్థుల అరెస్టులను వ్యతిరేకిస్తూ కాలేజీలు, యూనివర్సిటీల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. దీంతో ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులపై కఠిన ఆంక్షలను ఇందిర సర్కారు అమలు చేసింది. దేశవ్యాప్తంగా రాజకీయ సమావేశాలు, సభలు, ర్యాలీలు, నిరసనల నిర్వహణపై నిషేధం విధించింది.
మీడియా గొంతు నులిమిన వేళ
ఎమర్జెన్సీ సమయంలో మీడియాపై ఇందిర సర్కారు ఉక్కుపాదం మోపింది. ప్రెస్ సెన్సార్షిప్ విధించింది. నిజాన్ని మాట్లాడేందుకు యత్నించిన విలేకరులు, మీడియా నిర్వాహకుల గొంతును నులిమేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యజమాని రాంనాథ్ గోయెంకాను నాటి ప్రభుత్వం వేధించింది. కులదీప్ నయ్యర్, కె ఆర్ మల్కని లతో సహా దాదాపు 250 మందికిపైగా ప్రముఖ జర్నలిస్టులను నిర్బంధించింది. మీడియా సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
రాజ్యాంగేతర శక్తిగా సంజయ్ గాంధీ
ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా, కీలక అధికార కేంద్రంగా వ్యవహరించారు. 1976 ఏప్రిల్‌లో డిల్లీలోని పలు మురికివాడల ప్రజలను ఆయన బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారు. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నిలువ నీడను కోల్పోయారు. 1976లో ఓ కీలక రాజ్యాంగ సవరణ జరిగింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్ర కార్యక్రమాన్ని అమలు చేయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లభించింది.
దీంతో 1976 సెప్టెంబరులో సంజయ్ గాంధీ రంగంలోకి దిగి, ఢిల్లీ పరిధిలో పోలీసుల సహకారంతో బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించారు. దీన్ని ఆనాడు అందరూ ఖండించారు. అప్పట్లో ఈ విధంగా కోటి మందికిపైగా ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలను చేయించారని అంటారు. ప్రత్యేకించి పేదలు, అణగారిన వర్గాల ప్రజలకే ఈ సర్జరీలు చేయించారని చెబుతారు.
వేతనాలను తగ్గిస్తామని ఉద్యోగులను బెదిరించడం, సాగునీటిని ఆపేస్తామని రైతులను బెదిరించడం, పోలీస్ దాడులతో సామాన్య ప్రజలను భయపెట్టడం వంటి చర్యల ద్వారా కుటుంబ నియంత్రణ సర్జరీలు చేయించినట్లు నాటి వార్తాకథనాల్లో ఉంది. ఆనాడు అపరిశుభ్ర పరిస్థితుల్లో హుటాహుటిన ఈ సర్జరీలు చేయించడం వల్ల వేలాది మంది చనిపోయినట్లు సమాచారం. ఈ సర్జరీలు అత్యధికంగా యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగాయి. ఈ పరిణామాలన్నీ 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర ఓటమికి ప్రధాన కారణమయ్యాయి.
అత్యంత వివాదాస్పద తీర్పు
ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. దేశ ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోతుండటాన్ని, అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొంటుండటాన్ని న్యాయవ్యవస్థ కళ్లారా చూసింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (ఏడీఎం) 1976లో వివాదాస్పద తీర్పును వెలువరించారు. విచారణ లేకుండానే పోలీసులు తమను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ పలువురు జబల్‌పూర్ జిల్లా కోర్టును ఆనాడు ఆశ్రయించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తమకు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయని వాదించారు. వాటికి ప్రభుత్వం భంగం కలిగిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే వ్యక్తిగత హక్కుల కంటే ప్రభుత్వ అధికారమే పెద్దదని జబల్‌పూర్ ఏడీఎం స్పష్టం చేశారు. ఆయా పిటిషనర్లకు హెబియస్ కార్పస్ రిట్‌ను ఇవ్వలేమన్నారు. దీంతో ఈ కేసు (ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా) సుప్రీంకోర్టు దాకా చేరింది. 1976లోనే సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని విచారించింది.
అయితే నలుగురు న్యాయమూర్తులు జబల్‌పూర్ ఏడీఎం తీర్పును సమర్ధించారు. “జాతీయ ఎమర్జెన్సీ అమల్లో ఉన్న సమయంలో ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రజలు ఏదైనా కోర్టును ఆశ్రయించడాన్ని ఆపేయొచ్చు. ఆర్టికల్ 21లోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల అమలును కూడా తాత్కాలికంగా నిలిపి వేయొచ్చు” అని నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, వైవీ చంద్రచూడ్, పీఎన్ భగవతి పేర్కొన్నారు.
ఇదే ధర్మాసనంలోని మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా ఇందుకు భిన్నమైన వ్యాఖ్యానం చేశారు. “జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి పరమ పవిత్రమైనవి. ఎమర్జెన్సీ సమయంలోనూ వాటిని ఎవరూ ప్రజల నుంచి లాక్కోలేరు” అని ఆయన పేర్కొన్నారు. కాల క్రమంలో ఇందిరాగాంధీ సర్కారు కూలిపోయిన జనతా పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ సమయంలోనూ ఆర్టికల్ 21 అమలును నిలుపుదల చేయడం సాధ్యపడకుండా ఈ సవరణ చేసింది నాటి జనతా ప్రభుత్వం.
ఎమర్జెన్సీ వేళ ఆర్ఎస్ఎస్ పాత్ర
దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించాక ఇందిరాగాంధీ నిషేధించిన తొలి ప్రజా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). 1975 జూన్ 30న నాటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవ్‌రస్‌ను అరెస్టు చేశారు. 1975 జులై 4న ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారు. దీంతో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ఇళ్లే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. ఇతరత్రా రాజకీయ పార్టీల నేతలు కూడా వారి ఇళ్లలో సమావేశాలను నిర్వహించుకునేవారు.
అప్పట్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశంలో జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ మాస పత్రికలు, పక్ష పత్రికలు ప్రచురితం అయ్యేవి. వాటి ద్వారా ఇందిర సర్కారు తీరును ఆర్ఎస్ఎస్ ఎండగట్టేది. ‘సత్య సమాచార్’ పేరుతో తాజా వార్తల బులెటిన్ ప్రచురితం అయ్యేది. కాగా, ఎమర్జెన్సీ సమయంలో ముస్లిం సంస్థ జమాతే ఇస్లామీ సహా దాదాపు 26 రాజకీయ అనుబంధ సంస్థలను నిషేధించారు.
ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు కీలక భూమిక వహించారు. ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 నవంబర్ 14న ప్రారంభమైన సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్ట్ అయిన వారిలో 90 శాతం మంది వరకు ఆర్ఎస్ఎస్, సంబంధిత సంస్థలు చెందిన వారే ఉన్నారు. 1977 ఎన్నికల ప్రచారంలో, జనతా పార్టీ విజయం సాధించడంలో సహితం ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు కీలక పాత్ర వహించారు.
ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం
ఇందిరాగాంధీ అమలుచేసిన ఎమర్జెన్సీని పలువురు కాంగ్రెసేతర దిగ్గజ నేతలు సమర్ధించారు. ఈ జాబితాలో వినోబా భావే, బాల్ ఠాక్రే, ఎంజీ రామచంద్రన్, కుశ్వంత్ సింగ్, మదర్ థెరెసా, సీపీఐ నేతలు ఉన్నారు. నాటి ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవ్‌రస్ కూడా ఎమర్జెన్సీని సమర్ధించారనే తప్పుడు ప్రచారం చేశారు. ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చిన 2 నెలల తర్వాత నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఆయన ఒక లేఖను రాశారు.
ఆర్ఎస్‌ఎస్‌పై నిషేధం ఎత్తేయాలని అందులో కోరారు. మరో మూడు నెలల తర్వాత ఇంకో లేఖను ఇందిరకు బాలాసాహెబ్ దేవ్‌రస్ రాశారు. అందులోనూ ఆర్ఎస్‌ఎస్‌పై నిషేధం ఎత్తేయాలనే అంశాన్నే ఆయన ప్రస్తావించారు. ఏ సందర్భంలోనూ ఎమర్జెన్సీని బాలాసాహెబ్ దేవ్‌రస్ సమర్ధించలేదు. నాడు పెద్ద సంఖ్యలో జైలుపాలైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించే ఆయనకు ఆందోళన ఉండేది. ఎమర్జెన్సీ వల్ల దేశ ప్రజలకు క్రమశిక్షణ, ఆర్థిక వ్యవస్థకు సుస్థిరత లభిస్తాయనే ఇందిర వాదనతో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఆనాడు ఏకీభవించారు.
ఎట్టకేలకు ఎమర్జెన్సీ ఎత్తివేత
ఎట్టకేలకు అందరూ ఎదురు చూస్తున్న 1976 సంవత్సరం వచ్చేసింది. ఇందిరాగాంధీ పాలనా కాలం పూర్తయింది. ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. ఈ తరుణంలో లోక్‌సభ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లుగా 1976 ఫిబ్రవరి 4న ప్రకటన చేశారు. ఈ అదనపు ఏడాది పాలనా కాలంలోనూ ఎమర్జెన్సీని తొలగించడానికి ఇందిర ఆసక్తి చూపలేదు.
1977 జనవరి 18న ఆమె మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అవి కలిసి 1977 జనవరి 24న జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. దీనికి మొరార్జీ దేశాయ్ సారథ్యం వహించారు.
ఎమర్జెన్సీ ప్రభావంతో కాంగ్రెస్ ఘోర పరాజయం
1977 సంవత్సరం మార్చి 16 నుంచి 20 వరకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జనతా పార్టీ హోరాహోరీగా తలపడింది. ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇందిర ప్రధాని పదవిని కోల్పోయారు. అనూహ్యంగా జనతా పార్టీ 345 సీట్లను గెల్చుకుంది. దేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లుగా 1977 మార్చి 21న కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడింది. అధికారికంగా 1977 మార్చి 23 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది. 1977 మార్చి 24న దేశ నూతన ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
(ఈటివి భారత్ సౌజన్యంతో)
More Stories
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!