టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై హైవరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా,పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని ఆదివాసులపై విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది.
ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేయడంతో పాటు అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
మే1న తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా విడుదల నేపథ్యంలో ఏప్రిల్ నెల 26న నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సమయంలో పెహాల్గాం ఉగ్ర దాడికి సంబంధించిన వార్తలు పతాక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని వాఖ్యలు చేశారు.
“పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయాల్సిన పనే లేదు. అక్కడ ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వంపై వాళ్లే దాడి చేస్తారు” అని పేర్కొంటూ “కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుకొంటారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల్లో ‘500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్టుకున్నట్లు’ అనే పదజాలంపైనే ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాటలు ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వారిని అమర్యాదగా చిత్రీకరించేలా ఉన్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ కిషన్ సహా పలు గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదివాసీలు అనాగరికులు కారని, వారికి కూడా తమదైన జీవన శైలి, సంస్కృతి, చరిత్ర ఉన్నాయని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
More Stories
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్
తెలంగాణలో యూరియా కొరత రావొద్దు