కేసీఆర్ ను 50 నిముషాల సేపు విచారించిన పీసీ ఘోష్ కమిషన్

కేసీఆర్ ను 50 నిముషాల సేపు విచారించిన పీసీ ఘోష్ కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు​ను 50 నిమిషాల పాటు జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్​ బుధవారం 115వ సాక్షిగా​ విచారించింది. జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని, అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని మాజీ సీఎం కోరారు. కేసీఆర్​ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్​ పీసీ ఘోష్​ మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్​ను ప్రశ్నించారు. కమిషన్ కోర్ట్ గదిలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్, కేసీఆర్‌తో పాటు కమిషన్ సెక్రటరీ మురళీధర్ రావు ఉన్నారు. స్టెనోగ్రాఫర్, నోడల్ అధికారిని కూడా కమిషన్ బయటికి పంపించేసింది.
 
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్​ నివేదికను కమిషన్​కు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ నివేదికను కూడా కేసీఆర్​ అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్​ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్​ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది. 
 
విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీమంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులను కమిషన్ ప్రశ్నించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 5నే కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు. ఇప్పుడు కేసీఆర్​ను విచారించడంతో 115 మందిని విచారించినట్లు అయింది.
 
విచారణ నిమిత్తం కేసీఆర్ గత కొన్నాళ్లుగా సంప్రదింపులు జరిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆయనతో పలుమార్లు సమావేశమయ్యారు. న్యాయవాదులు, విశ్రాంత ఇంజినీర్లతో చర్చించి అవసరమైన వివరాలు, సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఉదయం అక్కడినుంచి నేరుగా కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ చేరుకున్నారు. 
 
కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసీఆర్​తో పాటు 9 మంది బీఆర్​ఎస్​ నేతలను మాత్రమే బీఆర్కే భవన్ లోపలికి అనుమతించిన, కేసీఆర్​ విజ్ఞప్తి మేరకు విచారణ సమయంలో అతని దగ్గర ఎవరూ లేరు. కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ప‌ద్మారావు గౌడ్, బండారి ల‌క్ష్మారెడ్డి, ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మ‌హ‌ముద్ అలీ బీఆర్‌కే భ‌వ‌న్‌లోకి వెళ్లారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద రెండుసార్లు పనిచేసిన హరీశ్‌రావు నీటిపారుదల శాఖతో పాటు కొన్నాళ్లు ఆర్ధిక శాఖ బాధ్యతలు చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పియర్స్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది. అప్పటివరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నించింది.