గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం

గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ బర్త్‌డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వారిలో 48 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్​ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్​ దునే మేఘావత్​ స్నేహితుడు దామోదర్ రెడ్డి ఉన్నారు.  ఈ  పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు.

పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.  విదేశీ మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను జప్తు చేశారు.  మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 
ఈ ఘటనతో సినీ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.