పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తి అవసరం

పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తి అవసరం
భారత్‌కు బంగ్లాదేశ్‌ క్రమంగా దూరమవుతున్న వేళ  ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమంటూ ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ లేఖ రాశారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని పేర్కొంటూ ఆయన ఎక్స్‌లో లేఖను పోస్ట్‌ చేశారు.

ఈద్‌-ఉల్‌- అధా సందర్భంగా మహమ్మద్‌ యూనస్‌కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‍ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని తెలిపారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని మోదీ తెలిపారు.

దీనికి స్పందిస్తూ యూనస్‌ మరో లేఖ రాశారు. ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని చెప్పారు.

ఈ క్రమంలో ప్రధాని మోదీకి, భారత ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. “పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తి భారత్, బంగ్లా ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. బక్రీద్ పండుగ త్యాగం, దాతృత్వం, ఐక్యత స్ఫూర్తితో సమాజాలను ఒకచోట చేర్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల గొప్ప ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి మనందరినీ ప్రేరేపిస్తుంది” అని యూనస్ తన లేఖలో తెలిపారు.

 
గతేడాది రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో వందలాది మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఆ సమయంలో బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. భారత్‌ కు వచ్చి ఆశ్రయం పొందారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రస్తుతం మహ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. ఈ కొత్త సర్కార్ వచ్చినప్పటికి భారత్​తో అంతగా సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ, యూనస్ లేఖలు రాసుకోవడం గమనార్హం.