ఆర్‌సీబీ విజయోత్సవాలకు ఎవ్వరు అనుమతి ఇచ్చారు?

ఆర్‌సీబీ విజయోత్సవాలకు ఎవ్వరు అనుమతి ఇచ్చారు?

* కర్ణాటక ప్రభుత్వంకు హైకోర్టు తొమ్మిది ప్రశ్నలు 

బెంగళూరులో ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కర్నాటక హైకోర్టును సమాధానాలు కోరింది. ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు.. ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతి తీసుకున్నారా? అంటూ పలు ప్రశ్నలను కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవంక మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారంను రూ 10 లక్షల నుండి రూ 25 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు.

జూన్ 4న ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటను కర్ణాటక హైకోర్టు స్వయంగా విచారించి, రాష్ట్ర ప్రభుత్వానికి పలు వేసింది. జూన్ 10 నాటికి ఆయా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీ కామేశ్వరరావు, న్యాయమూర్తి సీఎం జోషిలతో కూడిన బెంచ్‌ డివిజన్ బెంచ్ గురువారం ఈ విషయాన్ని స్వయంగా విచారించి ప్రభుత్వం నుంచి స్పందన కోరింది.  కోర్టు తొమ్మిది ముఖ్యమైన ప్రశ్నలపై కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరింది. జూన్ 10 నాటికి వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. 

కోర్టు అడిగిన ప్రశ్నల్లో కార్యక్రమాన్ని నిర్వహణకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు, ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతులు పొందారా? అని ప్రశ్నించింది. అలాగే, 50 వేల మందికిపైగా ప్రజలు గుమిగూడే ఇలాంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రామాణిక నిర్వహణ విధానం కలిగి ఉన్నదా? అని ప్రశ్నించింది. 

ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకున్నారా? జనసమూహ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంఘటన స్థలంలో ఏ విధమైన వైద్య, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి? హాజరయ్యే వారి సంఖ్య గురించి ముందుగానే ఏదైనా అంచనా వేశారా? గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారా? వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది? అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.