గూఢచర్యంలో కీలక సూత్రధారి పాక్ రిటైర్డ్ ఎస్ఐ

గూఢచర్యంలో కీలక సూత్రధారి పాక్ రిటైర్డ్ ఎస్ఐ

పాక్‌తో గూఢచర్యం కేసులో పాకిస్థాన్‌లోని పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన రిటైర్డ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ నాసిర్ థిల్లాన్ ఈ ‘స్పై రింగ్’ వెనుక కీలక సూత్రధారి అని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. గూఢచర్యంలో కేసులో ఇటీవల పట్టుబడిన జ్యోతి మల్హోత్రా సహా పలువురు యూట్యూబర్లతో ఇతను సంబంధాలు సాగిస్తూ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ తరఫున పనిచేస్తున్నట్టు వెల్లడైంది. 

నసీర్ థిల్లాన్ ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్ అయిన తరువాత ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ తనకున్న కాంటాక్టులతో గుఢచర్యం కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు బయటపడింది. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది.  కాగా, ఐఎస్‌ఐ కోసం రిక్రూట్‌మెంట్లు చేస్తూ గూఢచర్యం నెట్‌వర్క్‌ను థిల్లాన్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు. 

ఈ రాకెట్‌లో వందలాది మంది పాక్ మాజీ పోలీసులకు ప్రమేయం ఉండవచ్చని కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గూఢచర్యం కేసులో పంజాబ్‌కు చెందిన జస్బీర్‌ను అరెస్టు చేయడంతో థిల్లాన్ వ్యవహారం బయటకు వచ్చింది. థిల్లాన్ తనను ఒక ఐఎస్ఐ ఏజెంటుకు పరిచయం చేశాడని, లాహోర్‌లో అతనితో సమావేశం కూడా ఏర్పాటు చేశాడని జస్బీర్ వెల్లడించాడు.

జ్యోతి మల్హోత్రాతో సహా ఇండియాలోని పలువురు యూట్యూబర్లతో థిల్లాన్ పరిచయం పెంచుకుని వారిని ఐఎస్ఏ ఏజెంట్లతో సమావేశానికి థిల్లాన్ ఏర్పాట్లు చేసేవాడని గుర్తించారు. ఐఎస్ఐ ఆపరేటివ్స్‌తో పరిచయం చేసిన తర్వాత వారికి గూఢచర్యానికి సంబంధించిన పనులు అప్పగించేవాడని విచారణలో తేలింది. 

కాగా, డిజిటల్ వేదికను ఉపయోగించుకుని థిల్లాన్ భారత వ్యతిరేక ప్రచారం జరిపేవాడని, పంజాబ్‌లో మత ఉద్రిక్తలను రెచ్చగొట్టేవాడని చెబుతున్నారు. పంజాబ్‌లోని కొట్కాపుర ఏరియాలో గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేయడం వంటి సున్నితమైన అంశాలపై అంశాతిని ప్రేరేపించే పలు వీడియాలను సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేశాడని గుర్తించారు. 

ఈ వీడియోల్లో అతను నేరుగా పంజాబ్ సిక్కు పోలీసులను ఉద్దేశించి ప్రసంగించే వాడు. యూనిఫాం విడిచిపెట్టి కమ్యూనిటీ జస్టిస్ కోసం తిరగబడాలని కోరేవాడు. కమ్యూనిటీకి ప్రయోజనం చేకూరని పోలీస్ యూనిఫాం ఎందుకు? అని ప్రశ్నించేవాడు. అతని ప్రసంగాల వెనుక పంజాబ్‌లో మతసామరస్యాన్ని దెబ్బతీసి, ఇండియాలో ఖలిస్థాన్ అనుకూల శక్తుల నెట్‌వర్క్‌ను విస్తరించడమనే కుట్ర ఉందని గుర్తించారు.