మణిపూర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

మణిపూర్‌లో  ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
మణిపూర్‌లో నిషేధిత సంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని పోలీసులు శనివారం తెలిపారు. బిష్ణుపూర్‌, కాక్చింగ్‌, ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. నిషేధిత కాంగ్లీపాక్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌)కి చెందిన ఒక క్రియాశీల కార్యకర్తను బిష్ణుపూర్‌లోని వాంగూ సముషంగ్‌ ప్రాంతంలో దోపిడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.
కుంబి ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలు, దుకాణదారుల నుండి డబ్బు డిమాండ్‌ చేశాడని అధికారి తెలిపారు.  కాక్చింగ్‌ జిల్లాలోని ఎలాంగ్‌ఖన్‌పోక్పి మాయై లైకై ప్రాంతం నుండి మరొక సంస్థ సభ్యుడిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధిత యుపిపికెకు చెందిన ఒక కార్యకర్తను ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లాలోని ఖుంబోంగ్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

కాంగ్‌పోక్పి జిల్లాలోని కోట్జిమ్‌ గ్రామంలో జరిగిన గాలింపు చర్యలో మూడు తుపాకులు, ఎనిమిది షార్ట్‌బేరల్‌ తుపాకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెంగ్నౌపాల్‌ జిల్లాలోని యాంగౌబుంగ్‌ గ్రామంలో గురువారం నాలుగు అధునాతున పేలుడు పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, మెయితీ తెగకు చెందిన వాలంటీర్‌ గ్రూప్‌ అరంబాయ్‌ టెంగోల్‌ నాయకుడు కానన్‌ సింగ్‌ను పోలీసులు ఇంఫాల్‌లో శనివారం అరెస్టు చేయడంతో  మెయితీ తెగకు చెందిన యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు.

షాపులను ధ్వంసం చేయడంతోపాటు రోడ్లపై టైర్లను కాల్చివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో శనివారం రాత్రి 11.45 గంటల నుంచి ఐదు లోయ జిల్లాల్లో ఇంటర్నేట్‌, మొబైల్‌ డేటా సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని పేర్కొంది.

సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారలు తెలిపారు. మణిపూర్‌లో రెండు ఏళ్ల క్రితం జాతి హింస చెలరేగినప్పటి నుండి భద్రతా దళాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. మే 2023 నుండి మెయిటీలు, కుకీ-జో వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.