
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతి, నిర్మాణ లోపాలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ తనకు తెలిసిందే చెప్పారని తెలిపారు. కమిషన్ ముందు ఏదైతే చెప్పారో, బయట కూడా ఈటల ఒకటే చెప్పారని, కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. తప్పు చేయలేదు కాబట్టే ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు అయ్యారని తెలిపారు.
చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ విచారణకు హాజరై చూపించాలని సవాల్ చేశారు. కేవలం మాజీ ఆర్థికమంత్రిగానే ఈటల విచారణకు వెళ్లారని పేర్కొంటూ విచారణలో బీజేపీ స్టాండ్ ఏమిటని కమిషన్ అడగలేదని, అడగదు కూడా అని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏం జరిగిందో ఈటల కమిషన్ ముందు వివరించారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేది లేదని చెప్పారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా ఇతర అన్ని ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
కాగా తుమ్మల నాగేశ్వర రావు ఆల్ పార్టీ మంత్రి అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో, బీఆర్‌ఎస్ హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ మంత్రిగా పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ పక్షం అధికారంలోకి వచ్చిందని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ఎన్డీఏ 11 సంవత్సరాల పాలనపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ఆ విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెబుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ సారి శాసనసభపై ఎగిరేది బిజెపి జెండానే అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో వందల మంది చనిపోతే కాంగ్రెస్ ఏనాడు స్పందించలేదని, కానీ ఇప్పుడు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. పాకిస్తాన్ సైన్యం మన దేశ సైనికులను చంపితే ఉగ్రవాద స్థావరాలను సర్జికల్ స్ట్రైక్ పేరుతో ధ్వంసం చేశామని తెలిపారు.
అలాగే పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్ట్‌లని చంపితే ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేశామని చెప్పారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే తమను విమర్శించాలని, సైనికులని కాదని కిషన్‌రెడ్డి హితవు పలికారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘ బిజెపి సోషల్ మీడియా వర్క్ షాప్’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అసలైన వార్ చేస్తోంది బిజెపి సోషల్ మీడియానేనని అభినందించారు.
బీజేపీ సోషల్ మీడియా పనితీరు చాలా బాగుందని కిషన్ రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ప్రజలకు ఇచ్చినా హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. దేశంలో గత 11 ఏళ్లుగా సుపరిపాలన సాగుతోందని, అందుకే యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని చెప్పారు.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా