
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై ఎట్టకేలకు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ దిగొచ్చారు. 2026 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు కీలక ప్రకటన చేశారు. గతేడాది ప్రజాందోళనతో షేక్ హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచిపెట్టడంతో అప్పట్నించి ఎన్నికలు జరగనుండటం ఇదే ప్రథమం. వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రథమార్థంలో ఏదో ఒకరోజు ఎన్నికలు నిర్వహించనున్నట్టు దేశ ప్రజలకు తెలియజేస్తున్నామని మహమ్మద్ యూనస్ ప్రకటించారు.
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లతో గతేడాది బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు అట్టుడికాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశం విడిచి పారిపోయిన షేక్ హసీనా భారతదేశంలో తలదాచుకుంటున్నారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టును రద్దు చేయడంతోపాటు పలు నేరాభియోగాలపై అరెస్టు వారెంట్లూ జారీ చేసింది.
కాగా, యూనస్ సారథ్యంలోని తొమ్మిది నెలల తాత్కాలిక ప్రభుత్వం కొత్తగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఇటీవల బంగ్లాలో ఊపందుకుంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ‘కొత్త సర్వీసుల చట్టం’పై ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆందోళన బాట పట్టారు. డిసిప్లినరీ అఫెన్స్‌లకు పాల్పడుతున్న నాలుగు క్యాటగిరీల ఉద్యోగులను షోకాజ్ నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఈ ఆర్డినెన్స్ కల్పిస్తోంది.
దీనిని వ్యతిరేకిస్తూ ఎన్నికలు కోరుతూ ఉద్యోగులు, ప్రజలు ఆందోళలను ఉధృతం చేస్తున్నారు. ఇదే సమయంలో యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలోని హిందువులతో సహా మైనారిటీలపై హత్యాకాండలు, ప్రార్థనాస్థలాల ధ్వంసం వంటి ఘటనలు పెరిగిపోయాయి. దీనిపై భారత్ పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇంటా, బయటా ఎదురవుతున్న ఒత్తిళ్లతో మహమ్మద్ యూనస్ ఎట్టకేలకు దిగొచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ కీలక ప్రకటన చేశారు.
More Stories
వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన
ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్ట్ ల విజయం
మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు