హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్​ అనుమతి

హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్​ అనుమతి

* భద్రతామండలిలో ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది.

ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని మంగళవారం రాత్రి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్‌లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది.  ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్‌ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం జరిగిందని సంబంధిత వర్గాలు వివరించాయి.  భారత్‌కు చెందిన చమురు, ఎల్పీజీ నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇరాన్ అధికారులు అనుమతించారు. అటు అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ చెప్పిన ఇరాన్, భారత్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వడం విశేషం.  ఇరాన్ తాజా అనుమతితో రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలో చమురు, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
 
ఇలా ఉండగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో పాటు జోర్డాన్‌పై ఇరాన్ దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహ్రయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు ప్రకటించింది. ఈ తీర్మానానికి మొత్తం 135 దేశాలు మద్దతు తెలిపాయి. బహ్రయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్‌ల రాజకీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు ఈ దేశాలన్నీ సంఘీభావాన్ని తెలిపాయి. 
 
ఇరాన్ వెంటనే ఈ దేశాలపై దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి. హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలను ఖండించాయి. ఐరాస భద్రతా మండలిలోని 15 దేశాలకుగానూ 13 దేశాలు ఈ 2817 (2026) తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యాలు ఈ ఓటింగ్‌కు హాజరుకాలేదు.
మరోవంక, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ ఓడ లైబీరియా జెండాను పెట్టుకుని ముడి చమురు ట్యాంకర్​ను ముంబయి ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్‌ను తీసుకువచ్చిన షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.