శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్

శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్
* పరారీలో ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి 
పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు(బెయిల్ బాండ్) సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ‘లా’ విద్యార్థిని అయిన 22 ఏళ్ల శర్మిష్టని కోల్‌కతా పోలీసులు గత వారం గుర్గాంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వారం ప్రారంభంలో కోర్టు పనోలికి మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ‘చూడండి, మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది. కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధపెట్టడానికి కాదు. మన దేశం వైవిధ్యమైనది, వివిధ కులాలు, మతాలు, మతాలకు చెందిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి’. అని జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ తెలిపారు.

కాగా, పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శర్మిష్టపై దాఖలైన ఫిర్యాదులో ఎటువంటి నేర ప్రవృత్తి లేదని పనోలి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియా-పాకిస్తాన్ అంతటా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిందని, వీరిలో ఎక్కువ మంది పర్యాటకులని ఆయన కోర్టుకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. బెంగాల్‌లో ఆమెపై ప‌లు చోట్ల నాలుగు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయిన‌ట్లు ఆమె త‌ర‌పున లాయ‌ర్ పేర్కొన్నారు.

ఇలా ఉండగా, పనోలి అరెస్టు పశ్చిమ బెంగాల్‌ తోపాటు, యావత్ దేశంలో రాజకీయ వివాదానికి దారితీసింది. బెంగాల్‌లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) శర్మిష్ట పనోలి అరెస్టును “సెలెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్”గా అభివర్ణించింది. అంతేకాదు, కోల్‌కతా పోలీసులు తొందరపాటుతో వ్యవహరించారని ఆరోపించింది. అటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా శర్మిష్ట అరెస్టును తీవ్రంగా ఖండించారు. తాను శర్మిష్టకు అండగా ఉంటానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

 కాగా, శర్మిష్ట పనోలిని మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు అరెస్టు చేయడానికి దారితీసిన వ్యక్తి వజాహత్ ఖాన్ ఖాద్రీ. అతను దాఖలు చేసిన ఫిర్యాదు పైననే పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసారు. అయితే,  అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడని బుధవారం సీనియర్ అధికారులు తెలిపారు. “అతను (వజాహత్ ఖాన్ ఖాద్రీ) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ కేసుపై మేము దర్యాప్తు ప్రారంభించాము” అని కోల్‌కతాలోని ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
 
శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ అనే ట్రస వజాహత్ ఖాన్ ఖాద్రీపై కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శర్మిష్ట పనోలిపై ఆయన ఫిర్యాదు దాఖలు చేసిన పోలీస్ స్టేషన్ ఇదే. ముంబై, అస్సాంలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో సోషల్ మీడియా పోస్టులలో ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేశాడని, మత దేవతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అతనిపై ఎఫ్‌ఐఆర్ వచ్చింది. రషీది ఫౌండేషన్ అధిపతి, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ నివాసి అయిన ఖాద్రీ ప్రస్తుతం పరారీలో ఉన్నారని  పోలీసులు నిర్ధారించారు.
 
శర్మిష్ట పనోలి తండ్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, “నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ తండ్రి కూడా తన కూతురు జైలులో ఉండాలని కోరుకోడు… ఆమెకు కిడ్నీ సమస్య, అటెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్ డి) వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆమె మందులు తీసుకోవడం తప్పనిసరి… మా దగ్గర ప్రిస్క్రిప్షన్ లేనందున, మేము ఆమెకు జైలులో మందులు ఇవ్వలేకపోయాము… ఇది ఆమెకు మంచి గుణపాఠం అయి ఉండాలి.  ఇక నుండి ఆమె బాగానే ఉంటుంది” అని అన్నారు. 
 
శర్మిష్ట పనోలిపై పోలీసు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ కేసుకు సంబంధించి, అస్సాం కోర్టు వారెంట్ జారీ చేసిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. అయితే, పశ్చిమ బెంగాల్ పోలీసుల సహకారంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. “అస్సాం కోర్టు వారెంట్ జారీ చేసింది. ఇదంతా పశ్చిమ బెంగాల్ పోలీసుల సహకారంపై ఆధారపడి ఉంటుంది. అస్సాం పోలీసులు బెంగాల్‌లో క్యాంపింగ్ చేస్తున్నారు, వారు అస్సాం పోలీసులతో సహకరిస్తారా లేదా అని నాకు అనుమానం ఉంది” అని చెప్పారు.