జస్టిస్‌ వర్మపై ఆర్‌టిఐ పిటీషన్ తిరస్కరించిన సుప్రీం

జస్టిస్‌ వర్మపై ఆర్‌టిఐ పిటీషన్ తిరస్కరించిన సుప్రీం

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నోట్ల కట్టల వివాదం కేసులో సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ నివేదికను సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు యంత్రాంగ సమాచార గోప్యతతో పాటు పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలను కూడా ఉల్లంఘించే అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. 

ఈ అంశంలో అప్పటి సిజెఐ సంజీవ్‌ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని మోదీకి ఇచ్చిన లేఖ,  ఇతర సమాచారాన్ని కూడా అందించాలని అర్‌టిఐ దరఖాస్తు కోరింది. మార్చి 14న రాత్రి 11.35 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూమ్‌లో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలంటూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు, హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ షీల్‌ నాగు, జి.ఎస్‌.సంథావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనంటూ త్రిసభ్య కమిటీ నివేదికలో తెలిపింది. మే 3న దీన్ని ఖరారు చేసింది. 

ఈ నివేదికను మే 7న అప్పటి సిజెఐ సంజీవ్‌ ఖన్నాకు అందజేసింది. 50 మందికి పైగా వ్యక్తుల స్టేట్‌మెంట్‌లను, సాక్ష్యాధారాలను దర్యాప్తు చేసినట్లు కమిటీ విశ్లేషించింది. వీరిలో ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్ అరోరా, ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ చీఫ్‌లు కూడా వున్నారు.  జస్టిస్‌ వర్మ నివాసంలో నోట్లకట్టలు వున్నాయని వచ్చిన ఆరోపణలను  ధృవీకరించేందుక స్పష్టమైన సాక్ష్యాధారాలు వున్నాయని కమిటీ వెల్లడించింది.