
* పాక్ ఉగ్రవాదంకు మద్దతు ఆపితేనే సింధూ నీళ్లు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు మద్దతుగా తుర్కియే నిలవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ విషయాన్ని తుర్కియేకు ఇప్పటికే తెలియజేసినట్లు భారత్ చెప్పింది. ఉగ్రవాదంపై పోరాడటానికి కలిసి రావాల్సిన అవసరాన్ని ప్రపంచానికి గుర్తుచేసింది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని ఆపి వేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని పాకిస్థాన్‌ను తుర్కియే బలంగా కోరుతుందని ఆశిస్తున్నట్లు రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. తుర్కియే కఠిన వైఖరి తీసుకోవాలని, పాకిస్థాన్లో కేంద్రీకృతమైన ఉగ్రవాద వ్యవస్థలపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదం విషయంలో తుర్కియే సర్కార్ గట్టిగా వ్యవహరిస్తేనే భారత్తో సంబంధాలు మెరుగవుతాయని తేల్చి చెప్పారు.
దాయాది దేశానికి మద్దతిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని తుర్కియే ప్రోత్సహించినట్లు భావించాల్సి వస్తుందనే సందేశాన్ని తుర్కియేకు పంపినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు రణ్ధీర్ జైస్వాల్. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ను జవాబుదారీగా ఉంచాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాడటానికి కలిసి రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
“ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే మూడు బృందాలు బయలుదేరాయి. అందరిదీ ఒకటే లక్ష్యం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సంకల్పాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి చర్యలు తీసుకున్నాం. ఉగ్రవాదంపై పోరాడేందుకు మాతో ప్రపంచం కలిసి రావాలని మేం కోరుకుంటున్నాం. గత 40 సంవత్సరాలుగా భారత్కు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను అంతా కలిసి తిప్పికొట్టాలి” అంటూ జైస్వాల్ పిలుపునిచ్చారు.
సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని తెలిపారు. పాకిస్థాన్తో జరిగిన ఏ ద్వైపాక్షిక చర్చలైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి అప్పగించడం తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో చూపించిన ఆసక్తిపై రణధీర్ జైస్వాల్ స్పందించారు.
“చర్చలు, ఉగ్రవాదం కలిసి ఉండవని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఉగ్రవాదం విషయంలోనే కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్థాన్కు అందించిన ఉగ్రవాదుల జాబితాను భారతదేశానికి అప్పగించడం గురించి చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. జమ్ముకశ్మీర్పై జరిగే ఏ ద్వైపాక్షిక చర్చ అయినా పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని విడిచిపెట్టిన తరువాత మాత్రమే ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేసే ఉంటుంది” అని జైస్వాల్ స్పష్టం చేశారు.
More Stories
భారత్ ఇకపై ఉగ్రవాద బాధితురాలిగా ఉండదు
`జగన్నాథుడి’ ఒడిశాకోసం ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక