భారత్ లో 257 యాక్టివ్‌ కరోనా కేసులు

భారత్ లో 257 యాక్టివ్‌ కరోనా కేసులు
 
దక్షిణాసియాలో కరోనాకేసులు పెరుగుతున్న క్రమంలో భారత్‌లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని వారు తెలిపారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానలను ఆదేశించినట్లు వారు చెప్పారు. 
 
ముంబైలోని కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ దవాఖానలో గత వారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన రోగులలో ఓ మైనర్‌తోసహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ రోగులకు దీర్ఘకాలిక రోగాలు కూడా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. కేరళలో గతవారం రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్రలో ఏకంగా వందకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు చేయగా 106 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణె, కొల్హాపూర్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి రెండు కరోనా సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్‌ రోగి అని పేర్కొంది.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ డివిజన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌, కేంద్ర ప్రభుత్వ దవాఖానలకు చెందిన నిపుణులతో సోమవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కరోనా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సమావేశం నిర్ణయానికి వచ్చింది.  ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా తక్కువని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ కేసులలో చాలావరకు అన్నీ తేలికపాటి లక్షణాలతో ఉన్నవని, కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని దవాఖానలో ఉంచి చికిత్స అందచేయవలసిన అవసరం లేదని వారు చెప్పారు. సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌లో కరోనా పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్‌ చివరి వారంలో 11వేల కేసులు సింగపూర్‌లో నమోదుకాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్‌లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదుకాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు.