పట్టుబడిన డజన్‌కు పైగా పాక్ రహస్య ఏజెంట్లు

పట్టుబడిన డజన్‌కు పైగా పాక్ రహస్య ఏజెంట్లు
* ఐఎస్‌ఐకి సైనిక కదలికలు అందజేత
పాకిస్థాన్‌కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్‌తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్తరాదిలో కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి, తర్వాత ఆపరేషన్ సిందూర దశల్లో ఇంటెలిజెన్స్ వర్గాల నిఘాలో ఏజెంట్లను అరెస్టు చేశారు. పంజాబ్‌నుంచి ఆరుగురు, హర్యానా నుంచి ఐదుగురు , యుపి నుంచి ఒక్కరు పట్టుబడ్డారు. 
పలు రకాలుగా పొరుగుదేశం ప్రోద్బలాలకు లొంగి వీరు రహస్య సమాచారం తెలియజేసినట్లు, కొందరు తాము ఏమి చేస్తున్నామనేది తెలియని దశలో ఏజెంట్లుగా మారినట్లు వెల్లడైంది.  న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికారి ఎహసాన్‌ ఉర్‌ రహీం అలియాస్‌ డానిష్‌ని గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై భారత ప్రభుత్వం మే 13న దేశం నుంచి బహిష్కరించింది. 
పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌(పీఐఓలు)కి నిందితులంతా కీలకమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.  నిందితుల ఆర్థిక లావాదేవీలు, వారి ఎలక్ట్రానిక్‌ పరికరాల ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరుగుతున్నదని వారు చెప్పారు.  పంజాబ్‌, హర్యానా నుంచి జరిగిన అరెస్టులతోపాటు ఐఎస్‌ఐ ఏజెంట్‌ ఒకరిని ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో రాష్ట్ర ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు.
 
మే 4న ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫొటోలను ఐఎస్‌ఐకి చేరవేశారన్న ఆరోపణలపై అమృత్‌సర్‌లోని అజ్నాలాకు చెందిన ఫలక్‌షేర్‌ మాసీహ్‌, సూరజ్‌ మాసీ అనే ఇద్దరు వ్యక్తులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మే 11న డానిష్‌తో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను 31 ఏళ్ల గుజాలా అనే మహిళ, యమీన్‌ మొహమ్మద్‌గా గుర్తించారు.
వీరిద్దరూ మలేర్‌కోట్ల వాసులు. రహస్య సమాచారాన్ని చేరవేసినందుకు వీరిద్దరికీ ఆన్‌లైన్‌లో డబ్బు ముట్టినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాను డబ్బు కోసమే ఈ పనిచేసినట్లు గుజాలా ఒప్పుకున్నట్లు అధికారులు చెప్పారు.  భారతీయ సైన్యానికి చెందిన సమాచారాన్ని పంచుకున్నందుకు తనకు రూ.10,000, రూ. 20,000 యూపీఐ ద్వారా ముట్టినట్లు ఆమె అంగీకరించినట్లు వారు తెలిపారు.
పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము కశ్మీరులోని కీలక వ్యూహాత్మక ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని, సైనిక కదలికలను ఐఎస్‌ఐకి చేరవేసినట్లు సమాచారం అందడంతో మే 15న సుఖ్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌బీర్‌ సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ వెల్లడించారు.  హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నౌమాన్‌ ఇలాహీని పాక్‌లోని కొందరు వ్యక్తులకు కీలక సమాచారాన్ని సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణపై హర్యానా పోలీసులు మే 15న అరెస్టు చేశారు. మరుసటి రోజే కైథల్‌లో ఓ 25 ఏళ్ల పీజీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో తుపాకులు, రివాల్వర్ల ఫొటోలను అప్‌లోడ్‌ చేసినందుకు దేవేందర్‌ సింగ్‌ అనే విద్యార్థిని అరెస్ట్‌ చేశారు.