
హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని, పర్యావరణం దెబ్బతింటోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలలో వాతావరణ సంక్షోభం తీవ్రమవుతోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు.
శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను రక్షించుకోవడానికి ప్రాంతీయ సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఖాట్మండులో ప్రారంభమైన ‘సాగర్ మాత సంబాద్’ కార్యక్రమంలో యాదవ్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అంతర్ ప్రభుత్వ వేదిక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ) కింద హిమాలయ దేశాలు వన్యప్రాణుల సంరక్షణలో నాయకత్వ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
నేపాల్ ప్రభుత్వం శుక్రవారం నుండి ఆదివారం వరకూ వాతావరణ మార్పులు, పర్వతాలు అనే అంశంపై మొట్టమొదటి సాగర్ మాత సంబాద్‌ను నిర్వహిస్తోంది. మన పర్వతాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని యాదవ్ చెప్పారు. వాతావరణ మార్పుల కారణంగా మంచు కరిగిపోవడం, జీవవైవిధ్య ఒత్తిడులు, జల అభద్రత వంటి ఆందోళనకరమైన పరిణామాలు సంభవిస్తాయని, వీటిపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు.
పర్వతాల జీవనోపాధి, పురాతన సంస్కృతికి ముప్పు పొంచి ఉన్నదని ఆయన హెచ్చరించారు. పర్యావరణ సంక్షోభ భారంలో హిమాలయాలది గణనీయమైన భాగమని చెప్పారు. సంపన్న దేశాలు తమ నిబద్ధతను విస్మరించాయని యాదవ్ ఆరోపించారు.
More Stories
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ల సరఫరా
ఇరాన్‌పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు