నీరజ్‌ చోప్రా స‌రికొత్త రికార్డు

నీరజ్‌ చోప్రా స‌రికొత్త రికార్డు
భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్‌త్రోలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ సరికొత్త రికార్డుతో నీరజ్‌ కదంతొక్కాడు. శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ తొలిసారి 90.23 మీటర్ల మార్క్‌ అందుకుని ఔరా అనిపించాడు. గత కొన్నేండ్లుగా ఊరిస్తూ వస్తున్న 90 మీటర్ల దూరాన్ని తన మూడో ప్రయత్నంలో సాధించాడు. 
 
ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు(89.94మీ)ను చోప్రా బద్దలు కొట్టాడు. పోటీలో తన మొదటి ప్రయత్నంలోనే 88.44మీటర్ల మార్క్‌ అందుకున్న ఈ స్టార్‌ అథ్లెట్‌ రెండో ప్రయత్నంలో ఫౌల్‌ అయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో తన బలాన్నంతటినీ కూడదీసుకుంటూ ఇన్నాళ్లుగా అందినట్లే అంది దూరమవుతున్న 90మీటర్ల దూరాన్ని ఒడిసిపట్టుకున్నాడు.

అదే జోరును కొనసాగించడంలో చోప్రా ఒకింత విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో 80.56మీటర్లు విసిరిన నీరజ్‌ ఐదోసారి ఫౌల్‌ అయ్యాడు. ఆఖరిదైన ఆరో త్రోలో నీరజ్‌ 88.20మీటర్లకు పరిమితమయ్యాడు. ఇదే అదనుగా అప్పటి వరకు చోప్రా దరిదాపుల్లో ఉన్న జులియన్‌ వెబర్‌ ఆరో ప్రయత్నంలో ఏకంగా 91.06మీటర్లు విసిరి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 

కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమ మార్క్‌ అందుకున్న వెబర్‌..నీరజ్‌ను రెండో స్థానానికి పరిమితం చేయగా, అండర్సన్‌ పీటర్స్‌(85.64మీ)మూడో స్థానంలో నిలిచాడు. కాగా, కెరీర్ బెస్ట్ త్రో చేసిన నీర‌జ్ చోప్రాపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అభినందించారు. 

అద్భుత‌మైన మైలురాయిని సాధించావు, దేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది అంటూ నీర‌జ్‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు. “అద్భుతమైన ఫీట్! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచికి ద‌క్కిన‌ ఫలితం. భారతదేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది” అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.