31 శాతం తగ్గిన చార్‌ధామ్ పర్యాటకులు

31 శాతం తగ్గిన చార్‌ధామ్ పర్యాటకులు
 
* స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లే కార‌ణ‌మా?
 
ఛార్‌ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభం కాగా, గ‌త సీజ‌న్‌తో పోలిస్తే ఈ సారి చార్‌ధామ్ యాత్ర‌లో పాల్గొనే వారి సంఖ్య బాగా త‌గ్గింద‌ని డెహ్రాడూన్‌కు చెందిన ఎస్‌డీసీ ఫౌండేష‌న్ అనే ప‌ర్యావ‌ర‌ణ సంస్థ వివ‌రాలు వెల్ల‌డించింది. 2024లో యాత్ర తొలి రెండు వారాల్లో ద‌ర్శించుకున్న భ‌క్తుల‌తో పోలిస్తే ఈ ఏడాది అదే స‌మ‌యంలో 31 శాతం మంది త‌క్కువ‌గా యాత్ర‌లో పాల్గొన్నార‌ని ఆ సంస్థ తెలిపింది.

కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి ధామాల‌ను ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13వ తేదీ వ‌ర‌కు 6,62,446 మంది ద‌ర్శించుకోగా, గ‌తేడాది మే 10 నుంచి 23వ తేదీ వ‌ర‌కు అంటే 13 రోజుల్లో 9,61,302 మంది ద‌ర్శించుకున్న‌ట్లు వెల్ల‌డించింది.  అయితే భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గ‌డానికి ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌, ఆ తర్వాత స‌రిహ‌ద్దుల్లో పాకిస్తాన్‌తో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లే కార‌ణంగా భావిస్తున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొంది.

రాబోయే రోజుల్లో యాత్రికుల సంఖ్య పెర‌గ‌వ‌చ్చ‌ని ఎస్‌డీసీ ఫౌండేష‌న్ అంచ‌నా వేసింది. చార్‌ధామ్‌ యాత్రకు మే 15వ తేదీ నాటికి దాదాపు 28 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది అమెరికా, నేపాల్‌, మలేషియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా నుంచే ఎక్కువగా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఉత్తరాఖండ్‌ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లతో పాటు హేమకుండ్ సాహిబ్ సందర్శించుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా పర్యాటశాఖ రిజిస్ట్రేషన్‌ గణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.నేపాల్‌ నుంచి 5,728 మంది ప్రయాణికులు రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికా నుంచి 5,864, యూకే నుంచి 1,559, మారిషస్ నుంచి 837, ఇండోనేషియా నుంచి 327, కెనడా నుంచి 888, ఆస్ట్రేలియా నుంచి 1,259 పేర్లను నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.