మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. గత కొన్ని రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు మావోల ఏరివేతకు శ్రీకారం చుట్టాయి. ఈ ఆపరేషన్ లో పదుల సంఖ్యలో మావోలను మట్టుబెట్టారు. భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్ర హోంశాఖ దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నది.
దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి పిలిపిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్లు తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం, పామునూరు పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి.
అయితే ఛత్తీసగఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయంలోగా భారత్- పాక్ సరిహద్దుకు బలగాలు వెళ్లనున్నాయి. కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్ కగార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు.
గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ఆగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ కొనసాగిస్తున్నారు. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.
More Stories
అమెరికా, సింగపూర్లలో కేటీఆర్ పెట్టుబడులు?
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చాక్లెట్ల రూపంలో రూ. 24 కోట్ల కొకైన్!
ప్రభుత్వ అసమర్ధతతోనే వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు