కెనడాలో కాల్పులకు భారతీయ విద్యార్థిని మృతి

కెనడాలో కాల్పులకు భారతీయ విద్యార్థిని మృతి
కెనడాలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. వర్క్‌ కోసం వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడి ఉన్న సమయంలో కాల్పులు జరిగాయి. అయితే, ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారని, తూటాలు భారతీయ విద్యార్థినికి తగలడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. 

మృతురాలు కెనడాలోని ఒంటారియోలోని హామిల్టన్‌లోని మోహాక్ కళాశాల విద్యార్థిని అయిన హర్‌సిమ్రత్‌ రంధావాగా గుర్తించారు. హర్‌సిమ్రత్‌ మృతిపై భారత కాన్సులేట్‌ జనరల్‌ సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాన్ని సంప్రదిస్తున్నామని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి సంతాపం ప్రకటించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లుగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి విద్యార్థిని ఛాతి భాగంలో గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా తుదిశ్వాస విడిచింది. 

నల్లటి కారులో ఉన్న వ్యక్తులు తెల్లటి కారుపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కాల్పుల దుండగులు పారిపోయారని, సమీపంలోని ఇంటి కిటికీ గుండా ఓ బుల్లెట్ దూసుకెళ్లిందని, ఆ ఇంట్లోని వ్యక్తులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు వివరించారు.

కాగా, కెనడాలో భారతీయులతో పాటూ, హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతుండడంపై ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో ఓ భారతీయుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా విద్యార్థిని ఇలా కాల్పుల్లో మరణించడం అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది.  ఈ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.