కేంద్రం అదనపు సాయం చేసేలా చూడండి

కేంద్రం అదనపు సాయం చేసేలా చూడండి

* ఆర్థిక సంఘం ప్రతినిధులతో సీఎం చంద్రబాబు

గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా కేంద్రం తమకు అదనపు సాయం చేయాలని, కేంద్రం కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగరియాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం సమావేశమై రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలని కోరారు.  
 
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు.  రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన ఇచ్చారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించింది. దీనిపై ప్రధానికి వివరించారా? అని 16 ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఆరా తీసినట్లు తెలుస్తోంది. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను మరోమారు తెలిపారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఏ విధంగా దిగజారింది, ఏ విధంగా రాష్ట్రానికి 16వ సంఘం సాయం చేయాల్సి ఉంది అనే విషయాన్ని సీఎం వివరించారు.

కాగా, ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్సులు చేయలేదని పనగరియా చెప్పారు. అలాగని ఆర్థిక సంఘానికి ఎలాంటి షరతులు విధించలేదని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్​, అస్సాం జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరాయని పనగరియా వెల్లడించారు.  ప్రత్యేక హోదా అంశం ముగిసిందని ఇప్పుడది ఎవరికీ లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు గ్రాంట్లు ఎలా ఇవ్వాలనేది కమిషన్‌ నిర్ణయిస్తుందని  చెప్పారు.

కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలనే దానిపై నిర్ణయిస్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాల పర్యటనలు పూర్తయ్యాకే వివరాలు చెప్పగలమని పనగరియా పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్, మంత్రి డా. నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.