ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసంలో తెలంగాణ స‌ర్కార్ బిజీబిజీ

ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసంలో తెలంగాణ స‌ర్కార్ బిజీబిజీ
* కాంగ్రెస్ పాలనపై  మోదీ మండిపాటు

తెలంగాణ‌లో ప్ర‌కృతి విధ్వంసం కొన‌సాగుతున్న‌ద‌ని, మూగ జీవాల‌ను చంపేస్తున్నార‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను జెసిపిల‌తో ధ్వంసం చేయ‌డంపై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు.  సోమవారంనాడు హర్యానాలోని హిస్సార్‌లో మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తూ అటవీ సంపదను హరించే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించదని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హస్తినలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సిలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టిలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు) వారిని ‘ద్వితీయ శ్రేణి పౌరులు’గా మార్చిందని మోదీ ఆరోపించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌ బిజీగా ఉందని ఘాటు వాఖ్యలు చేశారు.

తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని విమర్శించారు. పచ్చని భూములపై బుల్డోజర్లు పంపి చెట్లను విధ్వంసం చేసి వణ్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారనంటూ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డాయి. ఈ వ్యవహారం కాస్త తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరడంతో న్యాయస్థానం జోక్యం చేసుకుని ఓ కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

తాజా ఈ భూమిలో జ‌రిగిన విధ్వంసంపై ప్ర‌ధాని స్పందించారు. 2014 కంటే ముందు కాంగ్రెస్‌ పాలనను మనం అస్సలు మరిచిపోకూడదని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. 

రాజకీయాలు అనేవి తమకు అధికారం కోసం కాదని.. ప్రజలకు సేవ చేయడానికి ఒక మాధ్యమం మాత్రమేనని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలా కాదని అన్నారు. ఒకసారి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు.  కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటికే అన్ని పనులు నిలిచిపోయాయని తెలిపారు. కర్ణాటకలో అయితే ప్రతిదీ ఖరీదైనదిగా మారిపోయిందని అన్నారు. అవినీతిలో కర్ణాటకను దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులే స్వయంగా చెబుతున్నారని తెలిపారు.